Supreme Court: అలా చేస్తే వ్యక్తి హక్కులు హరించినట్లే.. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Supreme Court: అలా చేస్తే వ్యక్తి హక్కులు హరించినట్లే.. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఉపశమనం లభించింది. ఈ స్కాంకు సంబంధించిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌ (Delhi CM Kejriwal) అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక వ్యక్తిని చాలాకాలం పాటు నిర్బంధించడం అంటే.. వాళ్ల హక్కులను హరించినట్లే. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు సరైందే అయినప్పటికీ.. అరెస్టు చేసిన టైం మాత్రం కరెక్టు కాదు. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీ వ్యక్తికి ‘బెయిల్ అనేది నిబంధన.. జైలు మినహాయింపు’గా ఉండాలి అని మరోసారి వ్యాఖ్యానించింది.

అధికారిక ఫైళ్లపై సంతాలు చేయొద్దు- సుప్రీంకోర్టు

దీంతో, ఆరునెలల తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ స్కాంకి (Delhi Excise Policy Scam Case) సంబంధించిన సీబీఐ (CBI) కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అలానే బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై ఇటీవలే సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది. కాగా.. కేజ్రీవాల్ కు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, రెండు ష్యూరిటీలతో బెయిల్ ఇచ్చింది. కాగా.. కేసు గురించి బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని పేర్కొంది.

హర్షం వ్యక్తం చేసిన ఆప్ నేతలు

కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు హర్షం వ్యక్తం చేశారు. అబద్ధాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరోసారి సత్యం గెలిచిందని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. "సత్యమేవ్ జయతే. సత్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఓడించలేము." అని అన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చిన ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ భార్య సునీతా ధన్యవాదాలు తెలిపారు. "ఆప్ కుటుంబానికి అభినందనలు! బలంగా, ఐక్యంగా ఉన్నందుకు అభినందనలు. మా ఇతర నాయకులను కూడా త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను" అని ఆమె సోషల్ మీడియా ఎక్స్ లో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story