పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు.. కేసు ఏప్రిల్ 30కి వాయిదా

by Disha Web Desk 17 |
పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు.. కేసు ఏప్రిల్ 30కి వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: పతంజలి రామ్‌దేవ్ బాబా‌పై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసును మంగళవారం సుప్రీంకోర్టులో విచారించారు. సంస్థ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తప్పులు పునరావృతం కాబోవని పేర్కొన్నారు. పతంజలి ప్రకనటల కోసం రూ. 10 లక్షలు ఖర్చు అయిందని కోర్టులో తెలిపారు. అయితే పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన యాడ్‌‌లకు, క్షమాపణల యాడ్‌ పరమాణంలో చాలా తేడా ఉందని, ఉత్పత్తుల యాడ్‌లు పెద్దవిగా కనిపిస్తుంటే, క్షమాపణలవి మాత్రం చిన్నవిగా ఎందుకు ఉన్నాయని సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది.

చాలా ఎఫ్ఎంసీజీ సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురిస్తున్నాయని, ముఖ్యంగా ఈ ఉత్పత్తులను వినియోగించే పిల్లలు, పాఠశాలకు వెళ్లే చిన్నారులు, సీనియర్ సిటిజన్‌ల ఆరోగ్యంపై ఇవి ప్రభావం చూపుతాయని దీనిపై కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లైసెన్సింగ్ అధికారులను ఈ కేసులో పార్టీలుగా చేర్చాలని కోర్టు కోరింది.

అలాగే, గత మూడేళ్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్‌లు దాఖలు చేయాలని మంత్రిత్వ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పతంజలి తన ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. తాజాగా విచారణలో భాగంగా పతంజలి ఆయుర్వేదం రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలపై ధిక్కార కేసును ఏప్రిల్ 30 కు కోర్టు వాయిదా వేసింది.



Next Story

Most Viewed