- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్చి 19న భూమిపైకి తిరిగి రానున్న సునితా విలియమ్స్

- నలుగురు వ్యోమగాముల కోసం డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధం
- ట్రంప్ ఆదేశాలతో ఏర్పాట్లు చేసిన ఎలాన్ మస్క్
దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ఎనిమిది నెలల క్రితం వెళ్లి అక్కడే చిక్కుకొనిపోయిన నాసా ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ మరో నెల రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు. నిరుడు జూన్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను డ్రాగన్ ఎయిర్‌క్రాఫ్ట్ మార్చి 19న భూమి మీదకు తీసుకొని రానుంది. సునితా విలియమ్స్, విల్మోర్‌లు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో నిరుడు జూన్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. అయితే స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో సాంకేతిక అవాంతరాలు రావడంతో ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమి మీదికి రాలేకపోయారు. దీంతో గత ఎనిమిది నెలలుగా ఇద్దరూ ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో నాసా సీనియర్ ఆస్ట్రొనాట్ అయిన సునితా విలియమ్స్‌ను ఐఎస్ఎస్ కమాండర్‌గా నియమించింది. మధ్యలో నాసా పలు మార్లు వారిద్దరినీ భూమిపైకి తీసుకొని రావాలన్న ప్రయత్నాలు సఫలం కాలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సునీతా విలియమ్స్‌తో పాటు విల్మోర్‌ను వెనక్కు తీసుకొని రావాలని ఎలాన్ మస్క్‌ను ఆదేశించారు. మార్చి 10న స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-10 మిషన్‌ను లాంఛ్ చేయనున్నారు. క్రూ-10 మిషన్‌లో నాసాకు చెందిన వ్యోమగాములు ఆనీ మెక్‌క్లెయిన్, నికోల్ ఏయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషీ, రష్యాకు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లు స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. మార్చి 12న భూమి నుంచి బయలుదేరి ఐఎస్ఎస్‌కు డాక్ అవుతుంది. ఈ సమయంలో కొత్తగా వచ్చిన వ్యోమగాములకు పాత వాళ్లు బాధ్యతలు అప్పగిస్తారు. వారం తర్వాత (మార్చి 19) ఐఎస్ఎస్ నుంచి సునితా విలియమ్స్, విల్మోర్, నిక్ హేగ్, రష్యాకు చెందిన అలెక్సాందర్ గోర్బోనొవ్‌ను తీసుకొని డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వెనక్కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం క్రూ-10 మార్చ్ 25న లాంఛ్ చేయాల్సి ఉంది. అయితే ట్రంప్ ఆదేశాలతో రెండు వారాల ముందుగానే ప్రయోగిస్తున్నట్లు నాసా తెలిపింది. కాగా, క్రూ-10ను ముందుగానే ప్రయోగించాలన్న నిర్ణయంతో ఆక్సియమ్ ప్రయోగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆక్సియమ్ మిషన్‌లో ఇండియాకు చెందిన సుభాన్షు శుక్లాతో పాటు పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు ఐఎస్ఎస్‌కు వెళ్లనున్నారు. కాగా, క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ 3 బిలియన్ డాలర్ల వ్యయంతో తయారు చేసింది.