వీవీఐపీల కోసమేనా.. ప్రజల కోసం వీధులు, ఫుట్‌పాత్ శుభ్రం ఎందుకు చేయరు?': బాంబే హైకోర్టు

by S Gopi |
వీవీఐపీల కోసమేనా.. ప్రజల కోసం వీధులు, ఫుట్‌పాత్ శుభ్రం ఎందుకు చేయరు?: బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: నగరంలో పారిశుద్ధ్యం, ఫుట్‌పాత్ ఆక్రమణల విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం, మునిసిపల్ అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, ఇతర వీవీఐపీల కోసం వీధులను, ఫుట్‌పాత్‌లను శుభ్రంగా ఉంచడం, క్లియర్ చేయడం సాధ్యమైనప్పుడు, సామాన్యుల కోసం కూడా ఎల్లప్పుడూ ఎందుకు అలా ఉంచరని ప్రశ్నించింది. ప్రధాని, వీవీఐపీలు ఉన్న సమయంలో శుభ్రంగా ఉంచగలుగుతున్నారు. అందరి కోసం కూడా అలాగే చేయాలి కదా.. పన్నులు కడుతున్నది ప్రజలే, వారికోసం సురక్షితమైన స్థలం, మెరుగైన రహదారులు ఉండాలి. ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం లభిస్తుందని గతేడాది ముంబయిలో వీధివ్యాపారులు, ఆక్రమణల సమస్యకు సంబంధించి సుమోటోగా స్వీకరించి బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ, మునిసిపల్ అధికారులు తీరును నిలదీస్తూ.. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసేలా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేయట్లేదని, దీనిపై తాము కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed