ఉత్తరప్రదేశ్ లో వింత!.. ఓ వ్యక్తికి ప్రతి శనివారం పాము కాటు.. విచారణకు ఆదేశించిన అధికారులు

by Ramesh Goud |
ఉత్తరప్రదేశ్ లో వింత!.. ఓ వ్యక్తికి ప్రతి శనివారం పాము కాటు.. విచారణకు ఆదేశించిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వ్యక్తి ప్రతి శనివారం పాము కాటుకు గురి అవుతున్న వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఫతేబాద్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారా అనే గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్ దుబేను ఓ పాము పగబట్టింది. 40 రోజుల్లో ఏకంగా ఏడు సార్లు పాము తనని కాటు వేసింది. ఇదిలా ఉండగా వికాస్ దుబేను ప్రతి సారి శనివారం మాత్రమే కరుస్తుండటం గమనార్హం. అతడు కాటుకు గురైన ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని ఒక్కరోజులోనే కోలుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. దీనిపై బాధితుడు పాము కాటుకు వైద్యం చేయించడానికి చాలా డబ్బు ఖర్చు చేశానని ఆర్ధిక సాయం అందించాలని స్థానిక కలెక్టర్ కార్యాలయాన్ని అభ్యర్ధించాడు.

దీనికి గిరి అనే అధికారి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పాము కాటుకు ఉచితంగా విరుగుడు ఇస్తారని అతనికి సలహా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ప్రతి శనివారం పాటు కాటుకు గురి కావడం విచిత్రంగా ఉందని, అసలు పాము కాటేస్తుందో లేదో తెలుసుకోవాలని, అతడు ప్రతీసారి ఒకే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందడం, చికిత్స చేయించుకున్న మరుసటి రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం అనుమానాలకు తావిస్తోందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్నారు. అంతేగాక ఈ ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు బయటకి వస్తాయని అధికారి తెలిపారు.

Advertisement

Next Story