Congress MP: మానవత్వంపై మరక: మాన్యువల్ స్కావెంజింగ్ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ దిగ్భ్రాంతి

by S Gopi |
Congress MP: మానవత్వంపై మరక: మాన్యువల్ స్కావెంజింగ్ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ దిగ్భ్రాంతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ వర్షా ఏక్‌నాథ్ గైక్వాడ్ మాన్యువల్ స్కావెంజింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని బాంద్రాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఎలాంటి రక్షణ లేకుండా మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆమె, ఇది మనందరిలోని మానవత్వంపై మరక లాంటిది. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇది పాత వీడియో కాదని, 2025లోనే జరిగిందని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ అమానవీయ ఆచారాన్ని నిషేధిస్తూ ఒక చట్టం వచ్చి దశాబ్దం గడిచింది. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం, భద్రత, రక్షణ సామగ్రి ఇవ్వాలని అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ మనమింకా అక్కడే ఉన్నామని పోస్ట్ చేశారు. 'దీన్ని అంతం చేయాలి. రెపోమాపో కాదు, మరొక పాలసీ తీసుకురావడం ద్వారా కాదు, సమిష్టి బాధ్యతతో ఇప్పుడే దీన్ని అంతం చేయాలని' ఆమె సూచించారు. ఇదే సమయంలో వీడియోలో జరిగిన ఘటన ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా కాదని, ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిందని చెప్పారు. ఇది విషాదం. మనకు కాలువలు శుభ్రంగా ఉండాలి, కానీ మనిషి ఇలాంటి మురికిలో దిగితే ఊరికే చూస్తూ ఉంటాం. ఇటువంటి చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడే ప్రైవేట్ కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని ఆమె అధికారులను కోరారు. ఇలాంటి ఘటనల పట్ల జరిమానాలు కఠినంగా అమలు చేయాలని, అటువంటి కాంట్రాక్టర్లను నియమించుకోవడం మానేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, ఒక మనిషిని మానసికంగా గాయపరుస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ డేటా

ప్రభుత్వ డేటా ప్రకారం, 2024, జూలై నాటికి దేశవ్యాప్తంగా 766లో 732 జిల్లాలు మాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించాయి. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మెకానిజం ద్వారా పనులను నిర్వహిస్తోంది. చిన్న పట్టణాలు కూడా ఇటువంటి యంత్రాలను కొనుగోలు చేయడంలో సహాయపడటానికి స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్ 2.0) కింద రూ. 371 కోట్లు కేటాయించారు.

Next Story