నిద్రించే హక్కును కాదనలేం.. బాంబే హైకోర్టు

by S Gopi |
నిద్రించే హక్కును కాదనలేం.. బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: నిద్రించే హక్కు అనేది మానవుల ప్రాథమిక హక్కు, దాన్ని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ 64 ఏళ్ల రామ్ ఇస్రానీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అనుసరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతేడాది ఆగష్టులో మనీలాండరిగ్ కేసులో ఈడీ సదరు వ్యక్తిని అరెస్ట్ చేసింది. తాను విచారణకు సహకరించానని, ఈడీ కోరినప్పుడల్లా తాను హాజరైనప్పటికీ అరెస్ట్ చేశారని, ఇది చట్ట విరుద్ధమని రామ్ ఇస్రానీ తన పిటిషన్‌లో వెల్లడించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదే సమయంలో అతనిని ఒక రాత్రి మొత్తం ప్రశ్నించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు నిందితుడు అంగీకరించిన తర్వాతే తెల్లవారుఝామున 3 గంటల వరకు విచారణ జరిపామని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేయడాన్ని అంగీకరించమని, నిద్ర మనుషులకు కనీస అవసరం. నిద్ర లేకపోవడం ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అతని మానసిక సామర్థ్యాలు, ఆలోచన, విషయాలను గుర్తించుకోవడం వంటి అంశాలను దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు రేవతి మోహితే-దేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. కాబట్టి నిద్రను అందించలేకపోవడం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలని, పిటిషనర్ అంగీకరించినప్పటికీ మరుసటి రోజు లేదా ఇంకోక సందర్భంలోనో వ్యక్తిని విచారించవచ్చని కోర్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed