Shivraj Singh: శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఊరట.. పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ జారీపై సుప్రీంకోర్టు స్టే

by vinod kumar |
Shivraj Singh: శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఊరట.. పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ జారీపై సుప్రీంకోర్టు స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో: పరువు నష్టం కేసులో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌(Shivaraj singh chouhan) కు ఊరట లభించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా(Vivek thanka) దాఖలు చేసిన ఈ కేసులో శివరాజ్ సింగ్, మరో ఇద్దరు బీజేపీ నేతలపై బెయిలబుల్ వారెంట్ అమలు చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. గత నెల 25న పరువు నష్టం కేసును రద్దు చేసేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దీంతో శివరాజ్ సింగ్ సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేయగా.. ఈ పిటిషన్‌ను జస్టిస్‌లు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లపై బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేయడం, కోర్టులో జరిగే విచారణలో వారు సమర్థవంతమైన భాగస్వామ్యానికి లోబడి ఉండదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో తంఖా ప్రతిస్పందన తెలియజేయాలని ఆదేశించింది.

అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. వివేక్ తంఖా ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు సభా వేదికపైనే చేశారని, అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 (2) కిందకు వస్తాయని తెలిపారు. ఆర్టికల్ 194 (2) ప్రకారం, శాసన సభ లేదా దాని కమిటీలో చెప్పిన ఏదైనా ఓటుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలోని ఏ సభ్యుడైనా ఏ న్యాయస్థానంలోనూ ఎటువంటి విచారణకు బాధ్యత వహించబోడని స్పష్టం చేశారు. 2021లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా శివరాజ్ సింగ్ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని తంఖా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది జనవరి 20న జబల్‌పూర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు బీజేపీ నేతలపై ఐపీసీ సెక్షన్ 500 కింద పరువునష్టం కేసు నమోదు చేసి కోర్టుకు సమన్లు ​​జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed