Sheikh Hasina : 3,500 మంది హత్యలు, అదృశ్యం కేసుల్లో హసీనా పాత్ర.. సంచలన అభియోగాలు

by Hajipasha |   ( Updated:2024-12-15 04:22:40.0  )
Sheikh Hasina : 3,500 మంది హత్యలు, అదృశ్యం కేసుల్లో హసీనా పాత్ర.. సంచలన అభియోగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్‌(Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా‌పై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లాదేశ్‌లో చాలామంది ప్రభుత్వ ఉన్నతాధికారుల అదృశ్యం, హత్య ఘటనల వెనుక ఆమె హస్తం ఉందని ఆరోపించింది. ఈ అంశాలపై విచారణకు బంగ్లాదేశ్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు కమిషన్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హసీనా పాలనా కాలంలో దాదాపు 3,500 మందికిపైగా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవడంతో పాటు హత్యలకు గురయ్యారని తెలిపింది. ఈ ఘటనల్లో హసీనా పాత్రపై తమకు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఆమె ఆదేశాల మేరకే పలు హత్యలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని దర్యాప్తు కమిషన్ వెల్లడించింది. ఈ ఘటనల్లో హసీనా (Sheikh Hasina)తో పాటు తారిఖ్ అహ్మద్ సిద్దీఖ్ (రిటైర్డ్ సైనికాధికారి), మాజీ టెలికమ్యూనికేషన్ విభాగం అధిపతి జియావుల్ అహసన్, సీనియర్ పోలీసు అధికారులు మునీరుల్ ఇస్లాం, మహ్మద్ హారూనుర్ రషీద్‌లకు పాత్ర ఉందని తెలిపింది. వీరంతా ప్రస్తుతం పరారీలోనే ఉన్నారని దర్యాప్తు కమిషన్ చెప్పింది. ఆగస్టు 5న షేక్ హసీనా దేశం విడిచి పరారైన వెంటనే.. ఈ నిందితులు కూడా ఫారిన్‌కు వెళ్లిపోయారని పేర్కొంది.

‘‘అధికారుల హత్యలు, అదృశ్యమైన ఘటనలన్నీ దాదాపు ఒకే స్టైల్‌లో జరిగాయి. అంటే కచ్చితంగా ఇది ఒకే టీమ్ చేసిన ఘాతుకం. అధికారంలో ఉన్నవాళ్లే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇదంతా చేయించారు’’ అని దర్యాప్తు కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొయినుల్ ఇస్లాం చౌదరి తెలిపారు. ఈ హత్యల కోసం పోలీసుల యాంటీ క్రైమ్ విభాగం ‘ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్’‌లోని కొందరు సిబ్బందిని వాడుకున్నట్లు ఆయన చెప్పారు. ఎవరికీ ఆధారాలు దొరకకుండా అధికారులను మాయం చేయించడంతో పాటు హత్యలు చేయించేందుకు ‘ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్’‌లోని నిపుణులను హసీనా ప్రభుత్వం వాడుకుందన్నారు. కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి హత్యలకు పాల్పడ్డారన్నారు. ఈనేపథ్యంలో ‘ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్’‌‌ను రద్దు చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎదుట దర్యాప్తు కమిషన్ ప్రతిపాదించింది.

Advertisement

Next Story

Most Viewed