ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రతా వైఫల్యం: గోడ దూకి రన్ వే పైకి దూసుకొచ్చిన నిందితుడు

by samatah |
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రతా వైఫల్యం: గోడ దూకి రన్ వే పైకి దూసుకొచ్చిన నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 27న భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి 11:30 గంటలకు ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టు గోడ దూకి రన్ వే పైకి దూసుకొచ్చాడు. ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ విమానాన్ని పార్క్ చేస్తున్నపుడు ఆ వ్యక్తిని గుర్తించి ఫైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించారు. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని హర్యానాలోని నూహ్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే నిందితుడు డ్రగ్స్‌కు బానిస అని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విమానాశ్రయ భద్రత సీఐఎస్ఎఫ్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ పరిధిలో ఉంటుందని, తమ వైపు నుంచి ఎటువంటి భద్రతా లోపం లేదని నగర పోలీసులు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనను ఎయిర్ పోర్ట్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే ముంబై విమానాశ్రయానికి రూ. 90 లక్షల జరిమానా విధించగా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.1.2 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story