Supreme Court: హైవేలు పార్కింగ్ స్థలం కాదు

by Shamantha N |
Supreme Court: హైవేలు పార్కింగ్ స్థలం కాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: శంభు సరిహద్దును పాక్షికంగా తెరవడం అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైవేలు పార్కింగ్ స్థలం కాదని స్పష్టం చేసింది. శంభు సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులను రోడ్డుపై నుంచి ట్రాక్టర్లను తొలగించేలా ఒప్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. అంబులెన్స్‌లు, అవసరమైన సేవలు, సులభతరం చేయడానికి శంభు సరిహద్దు దగ్గర రహదారిని పాక్షికంగా తెరవడం అవసరమని పేర్కొంది. రహదారులను పాక్షికంగా పునఃప్రారంభించేందుకు పంజాబ్, హర్యానా డీజీపీలతో పాటు చుట్టుపక్కల జిల్లాల ఎస్పీలతో వారంలోగా సమావేశం కావాలని ఆదేశించింది. నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్యానెల్ నిబంధనలపై సంక్షిప్త ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది.

పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ప్రశంసించిన కోర్టు

రైతులతో సంప్రదింపులు జరిపేందుకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను సూచించిన పంజాబ్, హర్యానా ప్రభుత్వాలని కోర్టు ప్రశంసించింది. ఇకపోతే, కనీస మద్దతు ధర చట్టం కోసం ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. శంభు సరిహద్దుల్లోని బారికేడ్లను వారంలోగా తొలగించాలని పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో అంబాలా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీకి కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో, హర్యానా ప్రభుత్వం శంభు సరిహద్దులను మూసివేసింది.

Advertisement

Next Story