తొలిసారిగా మిస్ యూనివర్స్ ఈవెంట్‌లో పాల్గొంటున్న సౌదీ అరేబియా

by S Gopi |
తొలిసారిగా మిస్ యూనివర్స్ ఈవెంట్‌లో పాల్గొంటున్న సౌదీ అరేబియా
X

దిశ, నేషనల్ బ్యూరో: సాంప్రదాయ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా సరికొత్త పంథాలో పయనిస్తోంది. క్రౌన్ ప్రిన్స్‌గా మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సౌదీ అరేబియాలో నెమ్మదిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మహిళల హక్కులకు ప్రాధ్యాన్యత లేని దేశంగా ఉన్న ఆ దేశం చరిత్రలోనే తొలిసారిగా 'మిస్ యూనివర్స్' పోటీల్లో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించి 27 ఏళ్ల మోడల్ రూమీ అల్ఖాహ్‌తానీ సోషల్ మీడియాలో తొలిసారిగా సౌదీ అరేబియా తరపున అధికారికంగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే మొదటి వ్యక్తి తానేనని చెప్పారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రూమీ అల్ఖాహ్‌తానీ ఇదివరకు మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లో పాల్గొన్నారు. 'ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం, ప్రామాణికమైన సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి చేరువ చేయడం నా ఆశయాలని' రూమీ అన్నారు. మిస్ సౌదీ అరేబియాతో పాటు, మిస్ మిడిల్ ఈస్ట్ (సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిళ్లను రూమీ కలిగి ఉన్నారు.

Advertisement

Next Story