Sanjay Raut: శివసేన (యూబీటీ)కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. సంజయ్ రౌత్

by vinod kumar |
Sanjay Raut: శివసేన (యూబీటీ)కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర శాసనసభలో శివసేన(యూబీటీ)కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు లేకపోయినా గతంలో విపక్ష పార్టీలకు అపోజిషన్ హోదా లభించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. కాబట్టి తమ పార్టీ ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తుందని తెలిపారు. శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడు లేకుండా సభా కార్యకలాపాలు నిర్వహించాలని రాజ్యాంగం(Constution)లో ఎలాంటి నిబంధనా లేదన్నారు. 288 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 50గా ఉందని తెలిపారు. తమ డిమాండ్ ను స్పీకర్ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 3వ తేదీ నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ డిమాండ్ కీలకంగా మారింది. కాగా, అసెంబ్లీలో శివసేన(యూబీటీ)కి 20 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు 16 మంది, ఎన్సీపీ (ఎస్పీ)కి 10 మంది సభ్యులున్నారు. మరోవైపు శివసేన (UBT) అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని కోరితే, శాసనమండలిలో అదే పదవిని తాము డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రస్తుతం, శివసేన (యూబీటీ)కి చెందిన అంబదాస్ దన్వే (Ambadhas dhanwe) శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టులో ముగియనుంది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed