ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-10-22 11:57:12.0  )
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

ముంబై: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఎన్నడూ అలాంటి యుద్ధాలు జరగలేదని, జరగబోవని ఆయన తేల్చి చెప్పారు. హిందూమతం అన్ని వర్గాల వాళ్లను ఆదరిస్తుందన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ స్కూల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 350వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.

‘‘దేశంలో అన్ని మతాలను, వర్గాలను గౌరవించే మతం ఏదైనా ఉందంటే అది హిందూమతం మాత్రమే. అందుకే మనం హిందువుగా గర్వించాలి’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. ‘‘ఇది హిందూ దేశం. అలా అని మిగతా మతాలను ద్వేషించాలని కాదు. ముస్లింలకు రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతోంది. శివాజీ మహారాజ్‌ పాలనా కాలంలో ఇలాంటి ఆక్రమణలు జరిగాయి. కానీ ఇలా రెండు మతాల మధ్య యుద్ధాలు జరగలేదు. అందుకే మనం హిందువులమని గర్వంగా చెప్పుకోవాలి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

భారత సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం.. రిజర్వేషన్‌లు ఉండాల్సిందే అని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. అఖండ భారతం గురించి ఈతరం కచ్చితంగా ఆలోచిస్తుందన్నారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన వాళ్లు ఇప్పుడు తప్పును తెలుసుకున్నారని పరోక్షంగా పాకిస్థాన్‌ గురించి మోహన్ భగవత్ ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed