Rajnath Singh: ఆ గ్రామాలను ‘మోడల్ విలేజ్‌’లుగా మారుస్తాం.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

by vinod kumar |   ( Updated:2024-09-11 13:43:00.0  )
Rajnath Singh: ఆ గ్రామాలను ‘మోడల్ విలేజ్‌’లుగా మారుస్తాం.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బార్డర్ ఏరియా డెవలప్ మెంట్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లతో సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో కనెక్టివిటీని పెంచడంపై దృష్టి సారించామన్నారు. ఆ గ్రామాలను మోడల్ విలేజ్ లుగా మార్చడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో గత పదేళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో 8,500 కిలోమీటర్ల పైగా రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. పదేళ్లలోనే 400 శాశ్వత వంతెనలను నిర్మించామన్నారు. అటల్ టన్నెల్, సెలా టన్నెల్, షికు-లా టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా అవతరించేవన్నీ సరిహద్దు ప్రాంత అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలుస్తాయని తెలిపారు.

లడఖ్ సరిహద్దు ప్రాంతాలను నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం 220-కిలో-వోల్ట్ శ్రీనగర్-లేహ్ విద్యుత్ మార్గాన్ని ప్రారంభించిందన్నారు. భారత్-నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా 1,500 గ్రామాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. గత నాలుగు సంవత్సరాల్లోనే 7,000కు పైగా సరిహద్దు గ్రామాలు ఇంటర్నెట్ కనెక్షన్‌లతో అనుసంధానించబడి ఉన్నాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలలో పర్యాటక రంగం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, అయితే మౌలిక సదుపాయాల కొరత కారణంగా అది అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయని ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.

Advertisement

Next Story