Borewell: ఆరురోజులుగా బోరుబావిలోనే చిన్నారి.. విలపిస్తున్న బాలిక తల్లి

by Shamantha N |
Borewell: ఆరురోజులుగా బోరుబావిలోనే చిన్నారి.. విలపిస్తున్న బాలిక తల్లి
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ లో బోరుబావిలో(Borewell) పడిన మూడేళ్ల బాలికను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ- బెహ్రర్‌ జిల్లాలో చేతన అనే చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. బోరుబావిలోని 150 అడుగుల వద్ద చిక్కుకున్న చిన్నారిని బయటకు తీసేందుకు దాదాపు ఆరురోజులుగా సహాయ సిబ్బంది శ్రమిస్తున్నారు. డిసెంబర్ 23న ఘటన జరగగా.. ఇప్పటివరకు చిన్నారిని బయటకు తీయకపోవడంపై స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తెను రక్షించాలంటూ బాలిక తల్లి కన్నీరుమున్నీరులుగా విలపిస్తున్నారు. చిన్నారిని కాపాడాలని అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ఘటనపై అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు బాలిక బంధువులు చెబుతున్నారు. “అధికారులను ప్రశ్నిస్తే.. కలెక్టర్ మేడం సమాధానం చెబుతారని వారు అంటున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బాధిత కుటుంబసభ్యులను కలెక్టర్ పరామర్శించలేదని ఆరోపించారు.

బోరుబావిలో పడిపోయిన చిన్నారి

రాజస్థాన్ లో మూడేళ్ల చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. తొలుత కుటుంబసభ్యులు పాపను రక్షించేందుకు యత్నించారు. దీంతో, చిన్నారి మరింత కిందకు జారుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. మంగళవారం క్లిప్‌ల సాయంతో 30 అడుగులు పైకి లాగినట్లు వెల్లడించారు. మరోవైపు.. చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో, బాలిక దగ్గరకు చేరుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికి చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed