మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

by Vinod kumar |
మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
X

రాయ్ గఢ్ (మహారాష్ట్ర) : భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒకే గ్రామంలో 13 మంది మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రాయ్ గఢ్ జిల్లాలోని ఖలాపుర్ సమీపంలో ఉన్న ఇర్సల్ వాడి కొండ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షం కురవగా ఇర్సల్ వాడి కొండపై ఉన్న గ్రామంలోని 48 ఇళ్లపై ఒక్కసారిగా మట్టిపెళ్లలు, కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 ఇళ్లు నేలమట్టమవ్వగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 కుటుంబాలకు చెందిన 225 మంది నివసిస్తున్న ఇర్సల్ వాడి గ్రామంలో.. దాదాపు 100 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం సాయంత్రం నాటికి శిథిలాల కింది నుంచి 75 మందిని రక్షించారు. వాహనాల ద్వారా గ్రామంలోకి వెళ్లే దారి లేకపోవడంతో.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ నడకదారిలోనే ఘటనా ప్రాంతానికి చేరుకుంది. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

కొండచరియలు విరిగిపడిన ఇర్సల్ వాడి గ్రామంలో సహాయక చర్యల్లో పాల్గొంటుండగా గుండెపోటు వచ్చి ముంబైకు చెందిన ఒక అగ్నిమాపక అధికారి మరణించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ రాయ్ గఢ్, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాయ్ గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, నాగ్ పూర్, థానే జిల్లాలలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రాష్ట్ర మంత్రులు దాదా భూసే, ఉదయ్ సమంత్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. "నేను సీఎం షిండేతో మాట్లాడాను. కొండచరియలు విరిగిపడిన ఇర్సల్ వాడీకి నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్‌ను పంపాం. బాధిత ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం, గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించడం మా ప్రాధాన్యత" అని పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed