Rahul Gandhi: మోడీకి రాహుల్ లేఖ.. ఎందుకోసమంటే?

by Shamantha N |
Rahul Gandhi: మోడీకి రాహుల్ లేఖ.. ఎందుకోసమంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేర‌ళ‌, గుజ‌రాత్‌, అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇచ్చే టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ లేఖ రాశారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌డం వ‌ల్ల‌.. స‌ముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఆ ఆందోళనను అంచనా వేయకుండా ప్రైవేటు కంపెనీల‌కు ఆఫ్‌షోర్ మైనింగ్ అనుమ‌తి ఇవ్వ‌డం ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. కేర‌ళ‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవిలో మైనింగ్‌కు ప‌ర్మిట్ ఇస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌కుండానే అనుమ‌తులు ఇచ్చార‌ని ఆరోపించారు. త‌మ జీవ‌నోపాధి, జీవితాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని తీరప్రాంత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని రాహుల్ అన్నారు. లక్షలాది మంది మత్స్యకారులు తమ జీవనోపాధి, జీవన విధానంపై పడే ప్రభావం గురించి రాహుల్ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌డాన్ని ఖండిస్తున్న‌ట్లు రాహుల్ త‌న లేఖ‌లో తెలిపారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని..

ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆఫ్‌షోర్ ఏరియాస్ మిన‌ర‌ల్ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు వెల్లడించారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌తో మెరైన్ లైఫ్‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని, కోర‌ల్ రీఫ్స్ డ్యామేజ్ జ‌రుగుతుంద‌ని, మ‌త్స్య సంప‌ద కూడా త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 13 ప్ర‌దేశాల్లో ఆఫ్ షోర్ మైనింగ్ కోసం ఖ‌నిజ మంత్రిత్వ‌శాఖ టెండ‌ర్లు ఆహ్వానించింది. ఆ స‌మ‌యంలో తీవ్ర నిర‌స‌న‌లు జ‌రిగిన‌ట్లు రాహుల్ త‌న లేఖ‌లో తెలిపారు. కేరళ విశ్వవిద్యాలయంలోని జల జీవశాస్త్రం, మత్స్య శాఖకు చెందిన మెరైన్ మానిటరింగ్ ల్యాబ్ (MML) నిర్వహించిన సర్వేలో కొల్లాంలో మెరైన్ మానిట‌రింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఫిష్ బ్రీడింగ్ స‌మ‌స్య ఏర్ప‌డనున్న‌ట్లు చెప్పారు. కేర‌ళ‌లో 11 ల‌క్ష‌ల మంది చేప‌ల వ్యాపారం చేస్తున్న‌ట్లు తెలిపారు. గ్రేట్ నికోబార్ విభిన్న పర్యావరణ వ్యవస్థలకు ఆశ్రయం కల్పిస్తుందని.. అనేక స్థానిక వన్యప్రాణులకు నిలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రభుత్వ చర్య వల్ల అక్కడ కోలుకోలేని నష్ట కలుగవచ్చన్నారు. ఇంకా, ఆఫ్‌షోర్ మైనింగ్ వల్ల పర్యావరణ, సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి కఠినమైన శాస్త్రీయ అధ్యయనాలు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed