Rahul Gandhi: రసాభాసగా మలివిడత బడ్జెట్ సమావేశాలు

by Shamantha N |
Rahul Gandhi: రసాభాసగా మలివిడత బడ్జెట్ సమావేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మలివిడత బడ్జెట్ సమావేశాలు రసాభాసగా కొనసాగుతున్నాయి. కేంద్ర తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని (National Education Policy) లోక్ సభలో తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీలు గళమెత్తారు. లోక్‌సభలో (Lok Sabha) డీఎంకే ఎంపీలు లేవనెత్తడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల చర్యపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) మండిపడ్డారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను వాయిదా వేసి.. తిరిగి ప్రారంభించారు. కొత్త విద్యా విధానాన్ని తమిళనాడులో అమలుచేయడంపై డీఎంకే ఎంపీలు నిరసిస్తూ వెల్‌ వైపు వెళ్లడంతో కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా, ఎన్ఈపీపై డీఎంకే చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే ఆడుకుంటోంది. వారంతా నిజాయతీ లేనివారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కోసం డీఎంకే ముందుకు రావట్లేదు. భాష పరమైన వివాదాలు సృష్టించడమే వారు పనిగా పెట్టుకున్నట్లున్నారు. విద్యను రాజకీయం చేస్తున్నారు. వారి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకం’’ అని ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై డీఎంకే నిరసన వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయన్న అంశాన్ని లేవనెత్తారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఓటరు జాబితాపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ జాబితాపై చర్చలు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత పేర్కొన్నారు.

రాజ్యసభలో ఎంపీల వాకౌట్

మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు రూల్ 267 కింద చర్చలు జరపాలని పదే పదే డిమాండ్ చారు. కాగా.. ఛైర్మన్ ప్రతిపక్షాలను విమర్శించడంతో వారు వాకౌట్ చేశారు. పార్లమెంటు కార్యకలాపాలను అణగదొక్కడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఛైర్మన్ గా వ్యవహరించిన నడ్డా ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. "ఇది పార్లమెంటును కించపరచడానికి చేసిన దుర్మార్గపు కుట్ర. వారు చర్చలో ఆసక్తి చూపట్లేదు. కానీ, ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఇష్టపడటం లేదనే అభిప్రాయాన్ని కల్పించేందుకు యత్నిస్తున్నారు." అని ఆరోపించారు. మరోవైపు, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలివిడత సమావేశాలు జరిగి పార్లమెంటు వాయిదాపడింది. కాగా.. మలివిడత సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఏప్రిల్‌ 4 వరకు మలివిడత కొనసాగుతాయి. బడ్జెట్టు సంబంధిత ప్రక్రియనంతా పూర్తి చేయడం, వక్ఫ్‌ సవరణ బిల్లును గట్టెక్కించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అంతేకాకుండా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం కోరే తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టనున్నారు. అమెరికా ప్రతీకార సుంకాలు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ విధ్యావిధానం, ఓటర్ల జాబితా తారుమారు వంటి అంశాలు రాజకీయంగా రగడ రేకెత్తిస్తున్నాయి.

Next Story