- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Zelenskyy: ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు రెడీ అయిన పుతిన్

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో(Zelenskyy) చర్చలు జరిపేందుకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ (Putin) రెడీ అయ్యారు. అవసరం అనుకుంటే ఇరుదేశాల అధిపతుల మధ్య చర్చలు ఉంటాయని మాస్కో వెల్లడించింది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా కీలక సంప్రదింపులు మొదలయ్యాయి. అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెమ్లిన్ నుంచి ఈ స్పందన వచ్చింది. 2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. అయితే, తాను అధికారంలోకి వస్తే ఆ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన ట్రంప్.. అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే అమెరికా-రష్యాలు మూడేళ్ల తర్వాత తొలిసారి ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అధికారికంగా చర్చలు మొదలుపెట్టాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్ వేదికగా ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ పాల్గొన్నారు. అదే సమయంలో అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ (Zelenskyy) చట్టబద్ధతను ప్రశ్నించింది.
ఉక్రెయిన్ లేకుండానే చర్చలు
అయితే, అమెరికా, రష్యా ప్రతినిధుల సమావేశంలో ఉక్రెయిన్ దౌత్యవేత్తలకు స్థానం లేకపోవడం గమనార్హం. ‘‘మేము లేకుండా మా గురించి జరిగిన ఒప్పందాలను గుర్తించం’’ అని జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. కాగా.. ఈ శాంతి చర్చల్లో ట్రంప్-పుతిన్ నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు, పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఇప్పటికే యూఏఈ చేరుకొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) కూడా ఈ శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మాస్కో విషయంలో ట్రంప్ చూపుతున్న సానుకూల వైఖరిపట్ల యూరప్, నాటో మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. నాటో (NATO)లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఈయూ సొంత సైన్యం తయారుచేసుకోవాల్సి ఉందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌కు సాయం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకున్న వేళ.. ఈయూ సందిగ్ధంలో పడింది. ఉక్రెయిన్‌ను ఒంటరిని చేయడం సరికాదని భావిస్తోంది. కీవ్‌కు సైనిక సాయం అందించాలనే దానిపై చర్చలు జరుపుతున్నాయి.