Pune: ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం.. పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో ఘటన

by Shamantha N |
Pune: ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం.. పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో దారుణం జరిగింది. రద్దీగా ఉన్న బస్టాండ్ లో ఆగి ఉన్న బస్సులో మహిళపై రేప్ జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. స్వర్గేట్ పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. మరోవైపు, ఈ ఘటన జరిగిన తర్వాత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మెడికల్ టెస్టుల కోసం బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని దత్తాత్రాయ్ రాందాస్ గా గుర్తించారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు 8 పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?

కాగా.. ఔంధ్ బనేర్ ప్రాంతంలో నివసించే 26 ఏళ్ల మహిళ ఒక హాస్పిటల్ లో పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్ బస్టాండ్‌కు చేరుకుని.. ఫల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం వేచి ఉంది. అయితే, అదే సమయంలో ఒక వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్‌ఫామ్‌ వద్దకు వచ్చిందని చెప్పాడు. నమ్మిన ఆ మహిళ అతడి వెంట వెళ్లింది. ఎవరూలేని చోట చీకటి ప్రదేశంలో పార్క్‌ చేసిన బస్సు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె ప్రశ్నించగా బస్సు లోపల కూర్చొన్నారని అతడు మాయమాటలు చెప్పాడు. ఆ మహిళ బస్సులోకి ప్రవేశించగానే లోపలి నుంచి డోర్‌ లాక్‌ చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

రాజకీయ గందరగోళం

ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లైంగిక దాడి ఘటనపై స్పందించారు. ఈ ఘటన "చాలా దురదృష్టకరం, బాధ కలిగించేది, ఆగ్రహం తెప్పించేది" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది. దేవేంద్ర ఫడ్నవీస్ పూణేలో పెరుగుతున్న నేరాలను విఫలమయ్యారని కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతను పణంగా పెట్టి 'ఉచితా'లపై దృష్టి సారించిందని విమర్శించారు. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం పట్ల భయం లేదని ఈ ఘటనలో తెలుస్తోందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే అన్నారు. పూణేలో నేరాలను అరికట్టడంలో హోంశాఖ విఫలమైందని ఆరోపించారు. అంతేకాకుండా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పూణే బస్టాండ్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించింది.

Advertisement
Next Story