PrayagRaj MahaKumbhmela : ప్రయాగ్ రాజ్ క్లీనింగ్ ఇలా..!

by M.Rajitha |
PrayagRaj MahaKumbhmela : ప్రయాగ్ రాజ్ క్లీనింగ్ ఇలా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్(UP) లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా(PrayagRaj MahaKumbhmela)కు కోట్లాది మంది భక్తులు తరలుతున్న విషయం తెలిసిందే. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటివరకు 47 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరి ఇంతమంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తూ.. నదిలో పూజా సామగ్రి, పితృ తర్పణలు, కొబ్బరికాయలు వదులుతుంటే.. ఆ నీరు తీవ్రంగా కలుషితం అవుతుంది కదా అనే అనుమానం రావొచ్చు. మరి ఆ నీరు ఎలా ఫ్రెష్ గా ఉంటుంది అంటే.. ప్రయాగ రాజ్ మున్సిపల్ అధికారులు ఘాట్ల వద్ద, నదిలో ఉన్న పూజ సామగ్రిని ఎప్పటికప్పుడూ క్లీన్ చేయిస్తున్నారు. కొబ్బరికాయలు, పువ్వులు.. పాత దుస్తులు వంటి వాటిని మెషీన్స్ సాయంతో నిరంతరం నది నుంచి తొలగిస్తుండటంతో.. ఆ నీరు స్వచ్చంగా ఉంటోంది.

కాగా మాఘ పూర్ణిమ సందర్భంగా బుధవారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే.. త్రివేణీ సంగమం, ఇతర ఘాట్‌ల వద్ద దాదాపు 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మాఘ పూర్ణిమ స్నానంతో తమ నెల రోజుల కల్పవాసీ దీక్ష ముగించుకొని దాదాపు 10లక్షల మంది మహా కుంభమేళా నుంచి తరలివెళ్లనున్నారు. దీంతో వారంతా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, పార్కింగ్‌ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, రద్దీని నియంత్రించడానికి అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం తెల్లవారుజాము 4 నుంచి మేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్‌ జోన్‌’(No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. దీంతో యాత్రికులు సంగమం వరకు వెళ్లాలంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే దారులన్నీ 300 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

Next Story