పేదలకు ఫ్రీగా ఫోర్టిఫైడ్ రైస్.. 100 శాతం నిధులు కేంద్రానివే

by Mahesh Kanagandla |
పేదలకు ఫ్రీగా ఫోర్టిఫైడ్ రైస్.. 100 శాతం నిధులు కేంద్రానివే
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పేదలకు తీపికబురు అందించింది. పోషకాల సమ్మిళిత బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించే పథకాన్ని మరో నాలుగేళ్లు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిదారులకు అందుతున్నది. ఫోర్టిఫైడ్ రైస్‌ను ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనా, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం పథకాల్లో భాగంగా 2028 డిసెంబర్ వరకు అందించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అనీమియా, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి తెస్తున్న ఈ పథకానికి వంద శాతం నిధులను కేంద్రమే భరించనుంది. రూ. 17,082 కోట్ల నిధులను ఇందుకు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 80 కోట్ల మంది పౌరులు లబ్ది పొందనున్నారు.

2019-2021 లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 దేశంలో అనీమియా తీవ్రంగా ఉన్నట్టు తేలింది. పిల్లలు, మహిళలు, పురుషుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. విటమిన్ బీ 12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ సహా పలు కీలక పోషకాల లోపాలు ఎక్కువ మందిలో ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఫోర్టిఫైడ్ రైస్‌ను అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణ బియ్యానికి పోషకాలు కలిపితే అవి ఫోర్టిఫైడ్ రైస్ అవుతాయి.

మరో రెండు నిర్ణయాలు

గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మేరీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడానికి కేబినెట్ అంగీకరించింది. రెండు దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15 వేలు, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించే అవకాశమున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో 2,280 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడానికి కేబినెట్ ఆమోదం లభించింది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, జాతీయ హైవే నెట్‌వర్క్‌తో మంచి కనెక్టివిటీ ఉండాలనే ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా రూ. 4,406 కోట్ల పెట్టుబడితో ఈ రోడ్లు నిర్మించనున్నారు.

Advertisement

Next Story