ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వమివ్వాలి.. ప్రధాని మోడీ

by Javid Pasha |
ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వమివ్వాలి.. ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ : జీ20 దేశాల కూటమిలో 55 ఆఫ్రికా దేశాలతో కూడిన "ఆఫ్రికన్ యూనియన్‌" కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఈమేరకు విజ్ఞప్తితో ఆయన శనివారం జీ20 దేశాల అధినేతలకు లేఖ రాశారు. సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జీ20 కూటమికి అధ్యక్ష హోదాలో భారత్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో మోడీ చేసిన సూచన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల జరిగిన జీ7 దేశాల సదస్సులోనూ ప్రధాని మోడీ ఆఫ్రికా దేశాల హక్కుల గురించి మాట్లాడారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ ఆఫ్రికా దేశాలకు చోటు దక్కాలని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో భారత్ నిర్వహించిన "గ్లోబల్ సౌత్" సదస్సులోనూ పేద, మధ్య ఆదాయ కేటగిరిలోని ఆఫ్రికా దేశాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రస్తుతం జీ20 కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, UK, US, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.


Advertisement

Next Story