- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
2030 నాటికి రూ.9 లక్షల కోట్ల టెక్స్‌టైల్ ఎగుమతులే లక్ష్యం

- నిరుడు 7 శాతం వృద్ధి నమోదు
- ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించాలి
- రూ.3,400 కోట్లకు చేరనున్న ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ మార్కెట్
- వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో టెక్స్‌టైల్ ఎగుమతులను పెంచేందుకు కేంద్రం పలు చర్యలను తీసుకుంటోంది. 2030 కల్లా రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న భారత్ టెక్స్ 2025లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇండియా వస్త్ర ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2030లోగా దీన్ని రూ.9 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. పదేళ్లుగా నిరంతరం శ్రమించడం వల్లే ఇవ్వాళ వస్త్ర రంగం విజయాలు సాధిస్తోందని చెప్పారు. దేశంలో ఉపాధిని సృష్టిస్తున్న అతిపెద్ద పరిశ్రమల్లో టెక్స్‌టైల్ రంగం కూడా ఒకటని, ఇది దేశ తయారీ రంగంలో 11 శాతం వాటాను కలిగి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడం వల్ల కోట్లాది మంది వస్త్ర కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
వస్త్ర రంగానికి అవసరమైన నాణ్యమైన పత్తిని సరఫరా చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత పత్తికి మరింత విలువను, పోటీని తీసుకొని రావడానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు ప్రధాని తెలపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను పెంచినట్లు ప్రధాని గుర్తు చేశారు. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి వస్తున్న ఆదాయంలో 80 శాతం వస్త్ర పరిశ్రమకు సంబంధించిందే అని మోడీ గుర్తు చేశారు. భారత్ హై-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ దిశలో ముందుకు సాగుతోందని, వస్త్ర రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నప్పుడే ఏ రంగం అయినా రాణిస్తుందని చెప్పారు. వస్త్ర పరిశ్రమలో నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తుందని.. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధికి సమర్థ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పారు. చేనేత కళాకారులు నైపుణ్యాలు, అవకాశాలు పెంపొందించుకోవడానికి.. వారి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ప్రధాని చెప్పారు.
గత పదేళ్లలో చేనేత అమ్మకాలను ప్రోత్సహించడానికి 2400 పైగా మార్కెటింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోర్‌బందర్‌లో ఖాదీ వస్తువుల ఫ్యాషన్ షో నిర్వహించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మన స్వాతంత్ర్య పోరాట సమయంలో 'దేశం కోసం ఖద్దరు' అని చెప్పారని.. ఇప్పుడు 'ఫ్యాషన్ కోసం ఖద్దరు' అని నినాదాన్ని తీసుకోవాలని మోడీ సూచించారు.
వస్త్ర పరిశ్రమలో వనరుల వినియోగాన్ని పెంచడంతో పాటు వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడమే లక్ష్యంగా పని చేయాలని మోడీ కోరారు. 2030 నాటికి ఫ్యాషన్ వ్యర్థాలు 140 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని.. వీటిని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో వెలువడుతున్న వ్యర్థాల్లో పావు కంటే తక్కువే రీసైకిల్ చేయబడుతుంది. దేశంలో వస్త్ర రీసైక్లింగ్ విషయంలో విభిన్న సాంప్రదాయ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా దీన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకోవచ్చని చెప్పారు. మహారాష్ట్రలో చిరిగిన బట్టలతో చాపలు, రగ్గులు, కవర్లు, సన్నని కుషన్లు తయారు చేస్తుంటారని మోడీ గుర్తు చేశారు.
సాంప్రదాయ కళలలో నూతన ఆవిష్కరణలు ప్రపంచ మార్కెట్‌లో మనకు అవకాశాలను కల్పిస్తాయని అన్నారు. నవీముంబై, బెంగళూరు నగరాల్లో వస్త్ర వ్యర్థాలను సేకరించే పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మోడీ చెప్పారు. రాబోయ రోజుల్లో ఇండియా టెక్స్‌టైల్ రీసైకిల్ మార్కెట్ 400 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్ల)కు చేరుకుంటుందని మోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలనే భారత్ లక్ష్యంలో వస్త్ర రంగం కూడా కీలక పాత్ర పోషిస్తుందని మోడీ చెప్పారు.