ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రిపై బాంబే హైకోర్టులో పిల్ దాఖలు

by Harish |   ( Updated:2023-02-01 12:55:56.0  )
ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రిపై బాంబే హైకోర్టులో పిల్ దాఖలు
X

ముంబయి: న్యాయ వ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు కొలీజియంపై బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. బాంబే లాయర్స్ అసోసియేషన్ చైర్‌పర్సన్ అహ్మద్ అబిది ఈ పిటిషన్ వేశారు. అత్యంత అవమానకరమైన భాషను ఉపయోగిస్తూ న్యాయ వ్యవస్థను దూషిస్తూ దాడి చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇద్దరు కార్యనిర్వాహక అధికారులు బహిరంగంగా సుప్రీం కోర్టు ప్రతిష్టను దిగజార్చారని పిటిషనర్ చెప్పారు. 'ఉపరాష్ట్రపతి, న్యాయ శాఖ మంత్రి సంయుక్తంగా కొలీజియం సిస్టమ్‌పై బహిరంగంగా దాడి చేశారు. రాజ్యాంగ పదవుల్లో కొనసాగుతున్న వీరిద్దరు బహిరంగంగా సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చారు' అని ఆ పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

ర్యాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేని వీరిద్దరు తమ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కాదని పిటిషన్ తరఫు న్యాయవాది ఏక్‌నాథ్ ఢోక్లే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌కర్ రాజీనామా చేయాల్సిందిగా, క్యాబినెట్ మంత్రి పదవి నుంచి రిజిజు తప్పుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వమని పిటిషనర్ కోరారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా విచారణ జాబితాలోకి రాలేదు.

Advertisement

Next Story

Most Viewed