ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు..23న కేంద్ర బడ్జెట్

by vinod kumar |
ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు..23న కేంద్ర బడ్జెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12వరకు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 23న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. మోడీ3.0 ప్రభుత్వంలో ఇవి మొదటి పూర్తి స్థాయి సమావేశాలు కాగా.. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ కూడా నూతన ప్రభుత్వంలో తొలి బడ్జెట్ కావడం గమనార్హం. దీంతో ఈ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

రికార్డు సృష్టించనున్న సీతారామన్

జూలై 23న నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఘనత సాధించనున్నారు. గతంలో మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా.. ఇప్పటికే దానికి సీతారామన్ సమం చేశారు. దీంతో తాజాగా సీతారామన్ ప్రవేశపెట్టె బడ్జెట్‌తో ఆ రికార్డును అధిగమించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed