అన్ని కేసులు కోర్టు రూముల్లో పరిష్కారం కావు

by John Kora |
అన్ని కేసులు కోర్టు రూముల్లో పరిష్కారం కావు
X

- మధ్యవర్తిత్వం వల్ల వినూత్న పరిష్కారాలు

- భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టమైనది

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా

దిశ, నేషనల్ బ్యూరో: అన్ని వివాదలు, కేసులు కోర్టు రూముల్లో పరిష్కారం కావు. మధ్యవర్తిత్వం ద్వారా వినూత్నమైన పరిష్కారాలు లభ్యమవుతాయి. అదే సమయంలో సంబంధాలను బలోపేతం చేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిిస్ సంజయ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంఎన్ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో సీజేఐ సంజయ్ ఖన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కేసును చట్టపరమైన సమస్యల దృష్టి నుంచి కాకుండా ఒక మానవ కథగా చూడాలని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనదని, ఇక్కడ ఇరువైపుల వారికి సహాయం అందించబడుతుందని ఆయన తెలిపారు. 'వివాదాలు, వ్యాజ్యాలు అన్నీ కోర్టు గదుల్లో పరిష్కారం కావు. మధ్యవర్తిత్వం అనేది ఒక పరిష్కారమార్కం. ఇది కోర్టు రూముల్లో కంటే మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. సాధారణంగా కోర్టు రూముల్లో లభించే 'అవును లేదా కాదు' అనే సమాధానాలకు మించి మధ్యవర్తిత్వంలో సృజనాత్మక పరిష్కారాలకు ద్వారాలు తెరుస్తుంది. దీన్ని ఎంచుకోవడం ద్వారా వివాదాలు సమర్థవంతంగా పరిష్కరించబడటమే కాకుండా.. మానవ సంబంధాలు కూడా బలోపేతం అవుతాయి' అని సీజేఐ సంజయ్ ఖన్నాచెప్పారు.

న్యాయవాదులు అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలరు. వారు ఒక సమస్యకు చట్టపరమైన పరిష్కారాన్ని మాత్రమే కాకుండా.. మానవీయ కోణంలో పరిష్కరించే సృజనాత్మక పరిష్కారాలను కనుగొనాలని సీజేఐ సూచించారు. రోజు రోజుకూ మన సమస్యలు క్లిష్టంగా మారుతున్నందు వల్ల వాటికి పరిష్కారాలు సరళంగా ఉండాలని చెప్పారు. మన దేశంలో న్యాయం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే దీన్ని సమయానుకూలంగా అందించడానికి మన పరిధులను మరింత విస్తృతపరుచుకోవాలని సీజేఐ కోరారు. మన పూర్వికులు మనం ఎదుర్కుంటున్న సవాళ్లను ఊహించలేదు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ వంటివి వాళ్లకు తెలియదు. క్లైమేట్ ఛేంజ్ అనేది మన పర్యావరణానికే కాకుండా మానవ హక్కులు, సామాజిక న్యాయం, డిజిటల్ ఎవల్యూషన్ వంటి వాటికి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇది మానవుడి సహజమైన స్వభావం, భద్రత, గోప్యత విషయంలో కూడా ఊహించని ప్రశ్నలను లేవనెత్తుతోందని సీజేఐ అభిప్రాయపడ్డారు.

సరికొత్త సాంకేతిక, సామాజిక గతిశీలత ద్వారా ప్రజాస్వామ్యం పునర్‌నిర్మంచబడుతుంది. ఇవన్నీ క్లిష్టమైన సమస్యలు మాత్రమే కావు. మానవత్వం, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించి వినూత్న పరిష్కారాలు అందించే ప్రాథమిక సవాళ్లు అని సీజేఐ చెప్పారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న వాటికంటే భిన్నమైనది, పటిష్టమైనది. ఇక్కడ బాధితులకు, నిందితులకు కూడా న్యాయ సహాయం అందుతుందని సీజేఐ తెలిపారు. ధృఢమైన న్యాయసహాయ వ్యవస్థ, యువ లాయర్ల సత్తాను కలిపితే ప్రపంచ శక్తిగా మారవచ్చని సీజేఐ చెప్పారు.

Next Story