నితీశ్ మరో సారి కూటమి మారడం ఖాయం

by Ajay kumar |   ( Updated:2025-03-05 15:28:28.0  )
నితీశ్ మరో సారి కూటమి మారడం ఖాయం
X

- సీఎం కావడం కోసం ఏమైనా చేస్తాడు

- కానీ ప్రజలు మాత్రం నితీశ్‌ను సీఎంగా ఒప్పుకోరు

- నితీశ్ శారీరికంగా, మానసికంగా రిటైర్ అయ్యారు

- స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ నాయకుడిగా మారిన ఎన్నికల వ్యూహర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారు. కానీ అధికారం కోసం కూటమిని మారుస్తాడని జోష్యం చెప్పారు. మరో సారి సీఎం కావడానికి నితీశ్ కుమార్ ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జన్‌సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు నితీశ్ ఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నా ఐదో టర్మ్ సీఎం కావడానికి మాత్రం ప్రజలు ఒప్పుకోరని చెప్పాడు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఎన్నికల తర్వాత నితీశ్ కుమార్ తప్ప ఎవరైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత కిశోర్ అంచనా వేశారు. కావాలంటే ఈ విషయాన్ని తాను రాసిస్తానని.. ఒక వేళ తాను తప్పని నిరూపణ అయితే నా రాజకీయ ప్రచారాలకు గుడ్ బై చెప్తానని ప్రశాంత్ కిషోర్ సవాలు సవాలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను ప్రకటించడానికి బీజేపీ అయిష్టతతో ఉందని, ఈ కారణంతో నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అతను బీజేపీతోనే కలిసి పోటీ చేస్తాడు. గతంలో కూడా అలాగే చేశాడని పీకే గుర్తు చేశారు. నితీశ్ కుమార్‌కు ప్రజాదరణ తగ్గుతున్న నేపథ్యంలో అతడిని ఎన్డీయేకి సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ సంశయిస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్‌ను ఐదేళ్ల పాటు సీఎంగా ఉంచుతామని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటించాలని పీకే సవాలు విసిరారు.అదే కనుక చేస్తే బీజేపీ సీట్లు గెలవడం కూడా కష్టమేనని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.

సీఎం నితీశ్ కుమార్ మానసికంగా, శారీరికంగా రిటైర్ అయిపోయారని.. ఇది తాను చెబుతున్న మాట కాదని.. గతంలోనే బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ అన్నారని పీకే గుర్తు చేశారు. నితీశ్ కుమార్ తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని పీకే చెప్పారు. ప్రధాని మోడీ కాళ్లు మొక్కడం ద్వారా బీహార్ ప్రజల గౌరవాన్ని నితీశ్ తాకట్టుపెట్టాడని విమర్శించారు. బీహార్‌ను నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కబంధ హస్తాల నుంచి విడిపించడమే జన్ సూరజ్ పార్టీ లక్ష్యమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

Next Story

Most Viewed