పక్క దేశాలకు వణుకే.. నిర్భయ్ క్షిపణి పరీక్ష సక్సెస్

by Disha Web Desk 17 |
పక్క దేశాలకు వణుకే.. నిర్భయ్ క్షిపణి పరీక్ష సక్సెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: సుదూర శ్రేణి లక్ష్యాలను సాధించడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ కొత్తగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీనిని స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్, మానిక్ టర్బోఫాన్ ఇంజిన్‌తో తయారు చేశారు. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి ఈ పరీక్షను నిర్వహించారు. టెస్టింగ్ సమయంలో రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం, టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్‌ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. ఇది అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

క్షిపణి అనుకున్న విధంగా సరైన మార్గంలో ప్రయాణించింది. గంటకు 860 కి.మీ నుంచి 1111 కి.మీ వేగాన్ని సాధించింది. ఇది 300 కిలోల బరువు ఉన్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీని గరిష్ట పరిధి 1500 కి.మీ. భూమి నుంచి 50 మీటర్ల నుంచి గరిష్టంగా 4 కి.మీ ఎత్తున ప్రయాణిస్తున్న లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. క్షిపణిలో అధునాతన ఏవియానిక్స్, సాఫ్ట్‌వేర్‌లను అమర్చారు. దీంతో అది దిశను మార్చుకుని కదిలే లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణి ప్రయాణ మార్గాన్ని వైమానిక దళానికి చెందిన Su-30-Mk-I విమానం నుంచి పర్యవేక్షించారు. నిర్భయ్ క్షిపణిని బెంగుళూరుకు చెందిన DRDO లేబొరేటరీ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) అభివృద్ధి చేసింది.

Next Story

Most Viewed