ఐఎస్ఎస్‌ను కూల్చడానికి స్పేస్ఎక్స్‌కు రూ. 7 వేల కోట్ల ప్రాజెక్ట్

by S Gopi |
ఐఎస్ఎస్‌ను కూల్చడానికి స్పేస్ఎక్స్‌కు రూ. 7 వేల కోట్ల ప్రాజెక్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే అంతరిక్ష ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) త్వరలో కూలిపోనుంది. 2030 నాటికి దీన్ని నిలిపేస్తున్నట్టు నాసా ఇప్పటికే ప్రకటించింది. దాన్ని త్వరలో భూ వాతావారణంలోకి తీసుకు వచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో వదిలేయనున్నట్టు అమెరికా అంతరిక్ష అధికారులు పేర్కొన్నారు. పాతబడిన ఐఎస్ఎస్ అంతరిక్షంలో చెత్త రూపంలో పేరుకుపోకుండా, భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు అడ్డంగా మారకుండా నాసా దాన్ని భూ కక్ష్య నుంచి తప్పించాలని నిర్ణయించింది. ఐఎస్ఎస్‌ను ధ్వంసం చేసే బాధ్యతను ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్ఎక్స్‌కు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 843 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో సుమారు రూ. 7,028 కోట్లు)కు కాంట్రాక్ట్ కుదిరింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్ (యూఎస్‌డీవీ)ను స్పేస్‌ఎక్స్ నిర్మించనుంది. ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ 430 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దీన్ని యూఎస్‌డీవీ దశల వారీగా భూకక్ష్యకు తీసుకొస్తారు. ఐఎస్ఎస్ సముద్రంలో క్రాష్‌డౌన్ స్పాట్‌లో దిగడానికి ముందు గంటకు 27,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూగ్రహ వాతావరణంలోకి దూసుకురానుంది. అనేస ప్రయోగాలకు సాక్ష్యంగా నిలిచిన ఐఎస్ఎస్‌ను 1998లో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో పూర్తి చేశారు. దీని నిర్వహణను అమెరికాతో పాటు రష్యా, కెనడా, జపాన్ వంటి దేశాలు చూస్తున్నాయి.



Next Story