జూన్ 1న చరిత్ర సృష్టించాలి.. వారణాసి ఓటర్లకు మోడీ వీడియో సందేశం

by Harish |
జూన్ 1న చరిత్ర సృష్టించాలి.. వారణాసి ఓటర్లకు మోడీ వీడియో సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో గురువారం ప్రధాని మోడీ తన నియోజకవర్గం వారణాసి ఓటర్లను ఉద్దేశించి వీడియో ప్రసంగంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 1న భారీ సంఖ్యలో ఓటు వేయాలని, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కాశీ ప్రజలు ఈసారి కొత్త రికార్డు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు, కాశీ యువతలో ఉత్కంఠను చూడగలిగాను. పోలింగ్ రోజున ప్రతి బూత్‌లో ఇలాంటి ఉత్కంఠను చూడాలని ఆశిస్తున్నాను, మీరు వేసే ప్రతి ఓటు నన్ను మరింత బలపరుస్తుంది, నాకు కొత్త శక్తిని ఇస్తుందని అన్నారు.

భక్తి, శక్తి, విరక్తకి ప్రతీక కాశీ. ఈ నగరానికి నేను ప్రాతినిధ్యం వహించడం విశ్వనాథుని అపారమైన దయ, ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది. కాశీ ప్రపంచ సాంస్కృతిక రాజధాని. సంగీతం, శాస్త్రాలకు ఈ భూమి నిలయంగా ఉంది. గంగా నది నన్ను అక్కున చేర్చుకుంది. కాశీకి ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ‘నవకాశీ’ గురించి మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కూడా సృష్టించే ఎన్నికలని మోడీ తన వీడియో ప్రసంగంలో అన్నారు. గత పదేళ్లలో కాశీ యువత సంక్షేమం, అభివృద్ధికి రాజధానిగా మారింది. కాశీ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. జూన్ 1న ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని ప్రధాని మోడీ అన్నారు.

ఇంతకుముందు 2014లో ప్రధాని మోడీ 3.7 లక్షల ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో దాదాపు 4.8 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో చివరి ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్ 1) జరగనుంది. వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఇదే రోజున పోలింగ్ ఉంటుంది.

Advertisement

Next Story