ప్రధాని కొంతమంది సంపన్నుల చేతుల్లో సాధనంగా మారారు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

by S Gopi |
ప్రధాని కొంతమంది సంపన్నుల చేతుల్లో సాధనంగా మారారు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని మోడీ ఒక సాధనంగా మారారని విమర్శించారు. వారందరి బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారని ఆరోపించారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోజికోడ్‌లోని కొడియత్తూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని ఎప్పుడూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడరని, కానీ ఒలింపిక్స్ గురించి మాట్లాడటం, నీటి అడుగున పూజలు చేయడం మాత్రమే కనిపిస్తుందని అన్నారు. 'ఇప్పటివరకు 20-25 మందికి ప్రధాని మోడీ రూ. 16 లక్షల కోట్లను ఇచ్చారు. కానీ దేశంలోని రైతుల గురించి ఆయనకు పట్టదు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్సెస్ ప్రయత్నిస్తున్నాయని, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని' రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాని మోడీ లక్ష్యం దేశంలోని ప్రజలను అసలు సమస్యల నుండి మరల్చడమేనని విమర్శించారు. అలాగే, ఎన్నికల బాండ్ల గురించి మాట్లాడుతూ.. ఇది ప్రధాని మోడీ దోపిడికి అసలు రూపమని పేర్కొన్నారు.

Advertisement

Next Story