వీసా పొడిగింపు వివాదం.. మోడీ సర్కార్ పై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ హాట్ కామెంట్స్

by Dishanational6 |
వీసా పొడిగింపు వివాదం.. మోడీ సర్కార్ పై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ హాట్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అవనీ దియాస్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వీసా పొడిగింపుని నిరాకరించిందని మోడీ ప్రభుత్వంపై అవనీ దియాస్ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలన్నీ సరైనవి కావని.. తప్పుదారిపట్టించేలా ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. అవనీ దియాస్ వీసా గడువు ముగిసిందని.. అయినప్పటికీ ఆమెకు ఎన్నికలు కవర్ చేసేందుకు వీసా పొడగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.

ఇకపోతే, వీసా గడువు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో భారత్ వదిలి వెళ్లాల్సి వచ్చిందని అవనీ దియాస్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం తర్వాత వీసా పొడిగించినా, ఆ విషయాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో భారత్ వీడాల్సి వచ్చిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన ఈ నెల 19నే భారత్ ను వదిలి వెళ్లినట్లు సోషల్ మీడియాలో తెలిపారు అవనీ దియాస్.

ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ దక్షిణాసియా బ్యూరో చీఫ్‌గా అవనీ దియాస్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన రిపోర్టింగ్‌ ‘హద్దులు దాటింది’ అని ఆరోపిస్తూ తన వీసా పొడిగింపును మోడీ ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. తనకు ఎన్నికల అక్రిడిటేషన్‌ కూడా రాదని అధికారులు చెప్పారని ఆమె తెలిపారు. మోడీ గొప్పగా చెప్పే ప్రజాస్వామ్య దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన రోజున ఆ దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం తరువాత తన వీసాను రెండు నెలలు పాటు భారత ప్రభుత్వం పొడిగించిందని.. కానీ ఈ విషయం తాను విమానం ఎక్కే కొన్నిగంటల ముందే తెలిసిందని చెప్పారు.

అవనీ దియాస్ వృత్తిపరమైన కార్యకలాపాలను చేపట్టేటప్పుడు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు కనుక్కున్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ.. ఆమె అభ్యర్థన మేరకు ఎన్నికల కవరేజీ కోసం ఆమె వీసా పొడిగించినట్లు తెలిపారు. అయితే ఆమె వీసా 20, ఏప్రిల్ 2024 వరకే చెల్లుబాటులో ఉన్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed