నెలసరి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
నెలసరి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నెలసరి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు ఇవ్వడం మంచి నిర్ణయమైనప్పటికీ.. దాని వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చని పేర్కొంది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని రెండు రాష్ట్రాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇస్తన్నాయి. మిగితా రాష్ట్రాల్లో ఈ నిర్ణయాన్ని పాటించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది. పీరియడ్ లీవ్ తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్ ని కొట్టివేసింది.

సీజేఐ ధర్మాసనం ఏమందంటే?

మహిళలకు నెలసరి సెలవులిస్తే వారిని ఉద్యోగాలు చేసేందుకు ప్రోత్సహించినట్లే అని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, వీటిని తప్పనిసరి చేయాలని చూస్తే.. అది ప్రతికూల పరిస్థితులకు దారితీసే అకాశం ఉందని అభిప్రాయపడింది. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు తగ్గిపోవచ్చని అంది. మహిళల ప్రయోజనం కోసం చేసే పనులు వారి భవిష్యత్ కు అడ్డంకిగా మారొద్దని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరిపి ఫ్రేమ్ వర్క్ ని రూపొందించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ పిటిషన్ ను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ కు తెలిపింది.

బిహార్, కేరళలో..

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నెలసరి సెలవులపై పిటిషన్‌ దాఖలయ్యింది. దానిపై విచారణ జరిపేందుకు నిరాకరించిన కోర్టు.. ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం బిహార్, కేరళ రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ఉద్యోగినలుకు రెండ్రోజుల నెలసరి సెలవు ఇస్తోంది. ఇక, ఇటీవల కేరళ ప్రభుత్వం విద్యార్థినులకు మూడు రోజులు సెలవు ఇస్తోంది.


Advertisement

Next Story