పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలు: ఎన్వీ రమణ

by GSrikanth |
పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలు: ఎన్వీ రమణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మీడియేషన్ వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఏఎంసీలో నిర్వహించిన ‘ఇండియా మీడియేషన్‌ డే’ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రన్‌, మరికొందరు న్యాయకోవిదులు, సింగపూర్‌ అంతర్జాతీయ మీడియేషన్‌ సెంటర్‌ చైర్మన్‌ జార్జ్‌ లిమ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ..మీడియేషన్‌ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు.

మొదటి ఇండియా మీడియేషన్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. మధ్యవర్తిత్వం అనేది మన పురాణాల కాలంలోనూ ఉంది. కౌరవులు, పాండవులు మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగింది. ఆర్థిక సంస్కరణల కారణంతో పాటు మీడియేషన్‌ బిల్లు రాక వల్ల మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగింది. ఈ ప్రక్రియ విశ్వసనీయతతో వేగవంతంగా సాగాలి. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉండాలి. దీనిలో కృత్రిమమేథనూ భాగం చేస్తున్నారు’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed