Manipur: మైతీ, కుకీలతో కేంద్రం సమావేశం.. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణపై చర్చ

by vinod kumar |
Manipur: మైతీ, కుకీలతో కేంద్రం సమావేశం.. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణపై చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ (Manipur) రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే శనివారం ఢిల్లీలో రాష్ట్రంలో అల్లర్లకు కారణమైన మైతీ (Maithee), కుకీ (Kukee) వర్గాల ప్రతినిధులతో సమావేశమైంది. రెండు వర్గాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడం, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలు కాపాడటం, సామరస్యాన్ని కాపడటానికి రెండు తెగల మధ్య సయోధ్య కుదర్చడంపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. మైతీ కమ్యూనిటీ తరపున, ఆల్ మణిపూర్ యునైటెడ్ క్లబ్స్ ఆర్గనైజేషన్ (AMUCO), ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (FOCS) సంస్థల నుంచి ఆరుగురు ప్రతినిధులు, కుకీ కమ్యూనిటీ నుంచి తొమ్మది మంది సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ ఏకే మిశ్రా పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ ఇటీవల లోక్‌సభలో మణిపూర్ అంశంపై మాట్లాడుతూ ఇప్పటికే మైతీ, కుకి సంస్థలతో చర్చలు జరిపామని, త్వరలోనే సంయుక్త సమావేశం జరుగుతుందని చెప్పారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏయే నిర్ణయాలు తీసుకున్నారనే విషయం వెల్లడించలేదు. కాగా, 2023 మే నుంచి రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా 250 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్రంలో అఫ్సాను పొడిగించడంతో పాటు సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశాక రాష్ట్రపతి పాలన విధించింది.

Next Story

Most Viewed