Manipur: ‘అఫ్సా’ చట్టాన్ని రద్దు చేయాలి.. మణిపూర్‌లో భారీ ర్యాలీ

by vinod kumar |
Manipur: ‘అఫ్సా’ చట్టాన్ని రద్దు చేయాలి.. మణిపూర్‌లో భారీ ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని రద్దు చేయాలని కోరుతూ మణిపూర్ (Manipur) రాజధాని ఇంఫాల్‌(Imphal)లో ప్రజలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంఫాల్‌ వెస్ట్‌లోని థౌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐదు కిలోమీటర్ల మేర కొనసాగి ఖుమాన్‌ లంపాక్‌ స్టేడియం వద్ద ముగిసింది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మణిపూర్‌ని నాశనం చేయొద్దని రాష్ట్రంలో అఫ్సాను తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆల్ మణిపూర్ యునైటెడ్ క్లబ్స్ ఆర్గనైజేషన్, పొయిరే లిమరోల్ మీరా పైబీ అపుంబ మణిపూర్, ఆల్ మణిపూర్ ఉమెన్స్ వాలంటరీ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ కమిటీ, మణిపూర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించాయి.

అఫ్సా చట్టాన్ని వెంటనే తొలగించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే నిరసన చెలరేగడంతో ఆందోళన నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంఫాల్‌లో భారీగా బలగాలను మోహరించారు. ‘మేము అఫ్సాకి వ్యతిరేకం. కుకీ మిలిటెంట్లు ఆరుగురు అమాయక మహిళలు, పిల్లలను చంపడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం’ అని ఓ నిరసనకారుడు తెలిపారు.

కాగా, జిరిబామ్ జిల్లాకు చెందిన ఆరుగురు పౌరుల హత్యల తర్వాత ఇంఫాల్‌లో భారీగా హింస నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు దుండగులు మంత్రులతో సహా పలువురు శాసనసభ్యుల ఇళ్లు, ఆస్తులపై దాడి చేసి దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే 5 జిల్లాల్లోని 6 పోలీసు స్టేషన్లలో మళ్లీ అఫ్సాను విధించారు. ఇది వచ్చే ఏడాది మార్చి 31వరకు వరకు అమలులో ఉంటుంది. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని తరచూ నిరసనలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed