2023 Manipur violence : 'సంపూర్ణ నిరాయుధీకరణతోనే మణిపూర్‌లో శాంతి'

by Harish |   ( Updated:2023-08-10 10:36:09.0  )
2023 Manipur violence : సంపూర్ణ నిరాయుధీకరణతోనే మణిపూర్‌లో శాంతి
X

ఇంఫాల్‌: మణిపూర్‌లో ఆయుధాల లూటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో సంపూర్ణ నిరాయుధీకరణ చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు సంపూర్ణ నిరాయుధీకరణ అవసరమన్నారు. కుకీ మిలిటెంట్లతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న "సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌" ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ‘ఎన్‌ఆర్‌సీ’ని అమలు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు స్వయంప్రతిపత్తి జిల్లా మండళ్లను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో రాష్ట్రంలోకి చొరబడుతున్న విదేశీ మూకలను అరికట్టాలన్నారు. వలసదారుల బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ ప్రక్రియను మరింత విస్తరించాలని కోరారు.

కుకీ గ్రూపులు డిమాండ్ చేస్తున్న ‘ప్రత్యేక పరిపాలన’ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఎమ్మెల్యేలు అన్నారు. హిల్ ఏరియా కమిటీ , ఆరు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ చర్యలన్నీ తీసుకున్న తర్వాత మణిపూర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అవసరమైన శాంతి చర్చలను ప్రారంభిస్తే ఫలితాలు ఉంటాయని ప్రధానికి రాసిన లేఖలో 40 మంది ఎమ్మెల్యేలు సూచించారు. కాగా, అంతకుముందు రాష్ట్రంలోని 10 మంది కుకీ ఎమ్మెల్యేలు కుకీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనను కోరుతూ కేంద్రానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed