Maha Kumbh: ఉత్తరప్రదేశ్ లోని ఖైదీలకు గంగాజలాలు..!

by Shamantha N |
Maha Kumbh: ఉత్తరప్రదేశ్ లోని ఖైదీలకు గంగాజలాలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు (Kumbh Mela) భక్తులు భారీగా తరలివస్తున్నాయి. ఇప్పటివరకు 56 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. అయితే, కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న ఖైదీల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ వ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలోని 90 వేలకుపైగా ఖైదీలకు గంగా జలాలతో స్నానం చేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలను సేకరించి.. ఫిబ్రవరి 21న ఆయా జైళ్లకు తీసుకువెళ్తామని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, అన్ని జైళ్లలో ఉన్న నీటితో గంగా జలాలను కలుపుతామన్నారు. పవిత్ర స్నానాల తర్వాత పూజలు, ఇతర కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. కుంభమేళాలో పాల్గొనాలనుకునే ఖైదీల కోసం చరిత్రలో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.

కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు

జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. కాగా.. త్రివేణి సంగమంలో దాదాపు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటికే 55 కోట్ల మంది గంగాస్నానాలు ఆచరించారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు రాగా.. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.

Next Story