Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

by Shamantha N |   ( Updated:2025-02-24 10:30:52.0  )
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో జరుగుతోన్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ (Global Investors Summit)లో ఆయన ప్రసంగించారు. మధ్యప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోంని ప్రపంచ బ్యాంకు చెప్పిందని మోడీ గుర్తుచేశారు. సమ్మిట్ లో ప్రధాని మాట్లాడుతూ..‘‘జనాభాపరంగా మధ్యప్రదేశ్‌ ఐదో అతిపెద్ద రాష్ట్రం. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మార్పులు జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారించింది. 20 ఏళ్లకు ముందు మధ్యప్రదేశ్ కు రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందుంది. అలాగే సౌరశక్తిలో భారత్ సూపర్‌ పవర్‌గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం ప్రశంసించింది. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్‌ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొంది. ఈ ఘనతలే పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందవు చెప్పుకొచ్చారు. మరోవైపు, మంగళవారం కూడా ఈ సమ్మిట్ జరగనుంది. దీనికి 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయా దేశాల దౌత్యవేత్తలు పాల్గొన్నారు. భారత వ్యాపార రంగ ప్రముఖులు కుమార్‌ మంగళంబిర్లా, గౌతమ్ అదానీ, నాదిర్ గోద్రెజ్‌ తదితరులు హాజరయ్యారు.

క్షమాపణలు కోరిన మోడీ

గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ఆలస్యంగా వెళ్లినందుకు మోడీ క్షమాపణలు కోరారు. ఆయన మాట్లాడుతూ..‘‘10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం.. నేను రాజ్‌భవన్‌ నుంచి బయల్దేరే సమయం ఒకటే. అప్పుడు నేను వస్తే భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కావొచ్చు. దాంతో విద్యార్థులు ఇబ్బందిపడే ఛాన్స్ ఉంది. అందుకే వారంతా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లాక రాజ్ భవన్ నుంచి బయల్దేరా. అందుకే దాదాపు 20 నిమిషాలు ఆలస్యమైంది. మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నా’’ అని మోడీ అన్నారు. మరోవైపు, ఇటీవలే ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక విడుదల చేసింది. అందులో రాబోయే రెండేళ్ల పాటు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. ఆ విషయాన్నే సమ్మిట్ లో మోడీ ప్రస్తావించారు.

Next Story

Most Viewed