జీవిత చరమాంకలో ఆశ్రయం కోసం..

by John Kora |
జీవిత చరమాంకలో ఆశ్రయం కోసం..
X

- నేరాల బాట పట్టిన వృద్ధురాలు

- జైలులో ఉచిత వసతి, ఆహారం దొరుకుతుందనే ఆశ

- జపాన్‌లో వృద్ధుల దీనావస్థకు అద్దం పట్టే ఘటన

దిశ, నేషనల్ బ్యూరో:

జీవిత చరమాంకంలో ఆలనాపాలనా లేక.. తమను తాము పోషించుకునే ఆర్థిక స్థోమత లేక.. చివరకు జైలులోనైనా సుఖంగా ఉంటాననే ఆశతో జపాన్‌లోని వృద్దులు నేరాల బాట పడుతున్నారు. అలాంటి సంఘటనే తాజాగా మరొకటి జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. అకియో అనే 81 ఏళ్ల వృద్ధురాలు బయట ఉండలేక నేరం చేసి జైలుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆహారం దొంగతనం చేస్తూ మొదటి సారిగా అకియో పోలీసులకు పట్టుబడింది. దీంతో ఆమెను టోక్యోలోని తొచిగి మహిళా జైలులో ఉంచారు. ఇది జపాన్‌లో అతిపెద్ద మహిళా కారాగారం. ప్రస్తుతం అందులో దాదాపు 500 మంది ఖైదీలు ఉండగా అందులో అధిక శాతం వృద్ధులే కావడం గమనార్హం.

జైలుకు రాకముందు అకియో తన 43 ఏళ్ల కుమారుడితో జీవించేది. అయితే కుమారుడు ఆమెను చూసుకోలేనని, ఇంటి నుంచి వెళ్లిపొమ్మని పదే పదే విసిగించడంతో బయటకు వెళ్లి తిండి కోసం దొంగతనం చేసింది. ఇక 2024 అక్టోబర్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేయగా.. మళ్లీ కుమారుడి దగ్గరకు వెళ్లలేక పోయింది. పైగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో జీవనం సాగించడం కష్టంగా మారింది. నిజాయితీగా బతకాలనే గట్టి నమ్మకం ఉన్నా.. వయసు పైబడటంతో ఏ పనీ చేయలేక మళ్లీ జైలుకు వచ్చానని అకియో చెప్పింది. జైలులో చాల మంది మంచి వాళ్లు ఉన్నారు. నాకు జైలులో ఉండటమే సుఖంగా అనిపించిందని అకియో పేర్కొంది. చాలా మంది వృద్ధులు జైలులో ఉండటానికే ఆసక్తి చూపిస్తున్నారని అధికారి టకయోషి షిరనగా చెప్పారు. కొంత మంది 20 వేల నుంచి 30 వేల యన్‌ల వరకు చెల్లించడానికి కూడా సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఇది దేశంలో ఉన్న వృద్ధుల దీనావస్థకు అద్దం పడుతుందని అన్నారు.

కాగా జపాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 36.25 మిలియన్ల మంది వృద్ధ జనాభా ఉన్నారు. ఇది మొత్తం దేశ జనాభాలో దాదాపు 30 శాతం. ప్రపంచంలో ఇంత ఎక్కువ శాతం వృద్ధ జనాభా ఉన్న దేశం జపానే కావడం గమనార్హం.

Next Story