సీట్ల పంపకాలపై ఆప్, కాంగ్రెస్ చర్చలు.. తొలి రోజు ఏమైందంటే ?

by Hajipasha |
సీట్ల పంపకాలపై ఆప్, కాంగ్రెస్ చర్చలు.. తొలి రోజు ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’లోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలపై సోమవారం ఢిల్లీ వేదికగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ తరఫున ముకుల్ వాస్నిక్, అశోక్ గెహ్లాట్, మోహన్ ప్రకాష్, అరవిందర్ సింగ్ లవ్లీ పాల్గొనగా.. ఆప్ తరఫున అతిషి, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్ పాల్గొన్నారు. ఢిల్లీలోని 7, పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో సీట్ల సర్దుబాటుపై, ఆయా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన ఉమ్మడి రాజకీయ వ్యూహంపై ఈసందర్భంగా చర్చించారు. దాదాపు 2 గంటలపాటు ఈ భేటీ జరిగింది.

పంజాబ్‌పై నో డిస్కషన్ ?

అనంతరం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో సీట్ల పంపకాలపై ఆప్‌తో చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయన్నారు. ఇంకొన్ని రోజుల పాటు ఈ చర్చలు కంటిన్యూ అవుతాయని.. ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటుపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. పోటీ చేసే స్థానాల్లో పార్టీల మధ్య సమన్వయం ఎలా సాధించాలనే దానిపైనా డిస్కషన్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో పంజాబ్‌పై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. ‘‘మా కూటమి చాలా పెద్దది. కాబట్టి ఇందులో కలిసి నడిచేందుకు అందరూ కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ చొరవ చూపి దేశమంతటా మంచి సందేశాన్ని వ్యాపింపచేస్తోంది. కూటమి గనుక సక్సెస్ అయితే ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి రాలేరు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story