Kolkata : మా కూతురిపై జరిగింది సామూహిక హత్యాచారమే.. కోర్టు ఎదుట జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ గోడు

by Hajipasha |
Kolkata : మా కూతురిపై జరిగింది సామూహిక హత్యాచారమే.. కోర్టు ఎదుట జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ గోడు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జూనియర్ వైద్యురాలి(31) తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టుకు కీలక వివరాలను తెలియజేశారు. మంగళవారం వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు సంచలన అంశాలను ప్రస్తావించారు. వాటి ఆధారంగానే ఈ కేసును సీబీఐకు బదిలీచేస్తూ ఆగస్టు 13న కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారి వాదనలకు సంబంధించిన వివరాలు తాజాగా బుధవారం వెలుగులోకి వచ్చాయి.

జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రుల వాదన ఇదీ..

‘‘జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని పోస్టుమార్టంలో తేలింది. ఒకరికి మించిన వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితేనే ఇలా జరుగుతుంది. మా కూతురిపై జరిగింది కచ్చితంగా గ్యాంగ్ రేపే’’ అని మృతురాలి పేరెంట్స్ కోర్టు ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. ‘‘గొంతు నులిమి మా కూతురిని చంపారని పోస్టుమార్టం నివేదికలో తేల్చారు. లైంగికదాడి చేసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా బిడ్డ శరీరంపై చాలా గాయాలున్నాయి. దారుణంగా, హింసాత్మకంగా ఆమెపై దాడి జరిగింది’’ అని జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు కోర్టుకు వివరించారు. ‘‘మా కూతురి తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. రెండు చెవులపైనా గాయాలయ్యాయి. అత్యాచారానికి తెగబడిన వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. చివరకు ఆమె పెదవులకూ గాయాలయ్యాయి. అత్యాచారం చేసే క్రమంలో బలప్రయోగంతో ఆమె నోటిని మూసి ఉంటారు’’ అని మృతురాలి పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మా కూతురిపై ముగ్గురు వ్యక్తులు హత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లే ఆమె ప్రాణాలు తీశారు’’ అని తమ పిటిషన్‌లో జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ‘‘మా కూతురిపై జరిగింది గ్యాంగ్ రేపే అని తెలిసినా.. సంజయ్ రాయ్ అనే హాస్పిటల్ సివిక్ వాలంటీర్‌ను అరెస్టు చేయడంతో బెంగాల్ పోలీసులు సరిపెట్టారు. ఇతర నిందితులను అరెస్టు చేసే దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు’’ అని వారు ఆరోపించారు.

సీబీఐ దర్యాప్తు ఫోకస్ అంతా ఆ అంశాలపైనే..

కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మెడికల్, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన సీబీఐ టీమ్ మూడు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తును మొదలుపెట్టింది. వీరిలో ఒక టీమ్ జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీ లభించిన సెమినార్‌ హాల్‌లోని క్లూస్‌ను సేకరించనుంది. మరో టీమ్ నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీకి అప్పగించాలని కోరనుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులతో మరో సీబీఐ టీమ్ సమన్వయం చేయనుంది. ఈ కేసు విచారణలో సీబీఐ ఆరు అంశాలపై దృష్టిపెట్టనుందని తెలుస్తోంది. వైద్యురాలిపై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా ? ఎక్కువమంది నిందితులు ఉన్నారా? అనేది తేల్చనుంది. ఇక ఇప్పటికే అరెస్టయిన నిందితుడు సంజయ్‌రాయ్‌ వెనక ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోనున్నారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన తర్వాత సాక్ష్యాలను నాశనం చేశారా ? తొలుత దీన్ని ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారు ? అనేది సీబీఐ అధికారులు తెలుసుకోనున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం ప్రమేయం ఉందా ? రాత్రి ఈ ఘటన జరిగితే ఉదయం దాకా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? అనే అంశాలపై సీబీఐ టీమ్ దర్యాప్తు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed