సీఎం కేజ్రీవాల్‌‌తో భార్య సునీత ములాఖత్ రద్దు

by Hajipasha |
సీఎం కేజ్రీవాల్‌‌తో భార్య సునీత ములాఖత్ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి నిరాకరించారు. సోమవారం రోజు కేజ్రీవాల్‌ను జైలులో కలిసేందుకు ఆమెకు తొలుత అపాయింట్‌మెంట్ ఇచ్చిన జైలు అధికారులు.. అకస్మాత్తుగా ఆ పర్మిషన్‌ను రద్దు చేశారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ భగ్గుమంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం సూచనల మేరకు జైలు అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. తొలుత సునీతకు అపాయింట్‌మెంట్ ఇచ్చి.. ఆ వెంటనే దాన్ని రద్దు చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆప్ పేర్కొంది. సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్‌ను జైలు అధికారులు ఉగ్రవాదిలా చూస్తున్నారని ఆరోపించింది. మోడీ ప్రభుత్వం అమానవీయతలో అన్ని హద్దులను దాటేసిందని ఆప్ వ్యాఖ్యానించింది. కాగా, సోమవారం రోజు కేజ్రీవాల్‌తో ఢిల్లీ మంత్రి అతిషి సమావేశం కానున్నారు. మంగళవారం రోజు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయనను జైలులో కలవనున్నారు. జైలులో ఖైదీలతో వారానికి గరిష్ఠంగా రెండు ములాఖత్‌లకే అనుమతి ఇస్తారు. ఈ లెక్క ఆధారంగానే సునీతకు ఇచ్చిన పర్మిషన్‌ను జైలు అధికారులు రద్దు చేశారని తెలుస్తోంది. అతిషి. మాన్‌లు కేజ్రీవాల్‌తో భేటీ అయ్యాక.. తదుపరిగా సునీత‌కు ములాఖత్‌ను కేటాయిస్తారని సమాచారం.

Advertisement

Next Story