కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంపై కేజ్రీవాల్ నజర్!

by Sathputhe Rajesh |
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంపై కేజ్రీవాల్ నజర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మే 10న జరగబోయే బై పోల్‌లో తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ రింకూ‌ను బరిలోకి దింపుతున్నట్లు ఆప్ పార్టీ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 14న రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (76) గుండెపోటుతో మరణించడంతో ఈ జలంధర్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో మే10 ఎన్నికలు నిర్వహించేందుకు జలంధర్ లోక్ సభ స్థానంతో పాటు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

కాంగ్రెస్ స్థానంపై ఆప్ నజర్

గత కొంత కొంత కాలంగా ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీని నిలువరించేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే కేజ్రీవాల్ మాత్రం కాంగ్రెస్ ఓట్లకు గండి కొడుతున్నాడనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని గద్దె దింపి ఆమ్ ఆద్మీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇదే ఊపుతో జలంధర్ స్థానాన్ని దక్కించుకోవాలి ఆప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక్కడ గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి సంతోఖ్ సింగ్ చౌదరినే గెలుపొందారు.

ఆయన మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికకు సంతోఖ్ చౌదరి భార్య కరమ్‌జిత్ కౌర్ చౌదరిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో ఆప్ పోటీకి రావడం ఆసక్తిగా మారింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జలందర్ స్థానంలో ఆప్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆప్ ప్రకటించిన అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed