Kashmir election: గందర్‌బల్ నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ.. 32 మందితో ఎన్సీ రెండో జాబితా రిలీజ్

by vinod kumar |
Kashmir election: గందర్‌బల్ నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ.. 32 మందితో ఎన్సీ రెండో జాబితా రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గందర్‌బల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మంగళవారం 32 మంది అభ్యర్థులతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో ఒమర్ అబ్దుల్లా పేరు సైతం ఉంది. గందర్‌బల్ ఎన్సీకి బలమైన కోటగా ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 1977లో ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా 1983, 1987, 1996లో విజయం సాధించారు. ఆ తర్వాత ఒమర్ అబ్దుల్లా 2008లో గెలుపొందారు. దీంతో మరోసారి అదే సెగ్మెంట్ నుంచి ఒమర్ బరిలో నిలవనున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించిన ఒమర్ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలో ప్రకటించారు. శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఆయన తన వైఖరిని మార్చుకుని పోటీ చేయనుండటం గమనార్హం. అంతకుముందు ఈ నెల 26న ఎన్సీ 18 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది. దీంతో తాజా లిస్టులో కలిపి మొత్తం 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. ఇంకా ఒక పేరు మాత్రమే వెల్లడించాల్సి ఉంది.

కాగా, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎన్‌సీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 5 స్థానాల్లో స్నేహపూర్వక పోరు జరగనుడగా, సీపీఎం, పాంథర్స్‌ పార్టీకి 2 సీట్లు కేటాయించారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు కశ్మీర్‌లో జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి సారి ఎన్నికలు జరగనుండటంతో సర్వత్రా ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story