Karnataka: విభజన శక్తుల కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి: కర్ణాటక సీఎం

by S Gopi |
Karnataka: విభజన శక్తుల కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి: కర్ణాటక సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యత ముసుగులో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విద్రోహ, విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మక మానవహారాన్ని ప్రారంభించిన అనంతరం విధానసౌధలోని గ్రాండ్ స్టెప్స్‌లో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రసాదించిన బహుళత్వాన్ని దైనందిన జీవితంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విభజన శక్తుల కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధుడు, బసవన్నల కాలంలో దేశంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థలు ఉండేవని, 'అనుభవ మంటపం' ప్రారంభ ప్రజాస్వామ్య సంస్థలకు చిహ్నంగా ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1949, నవంబర్ 25న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రసంగాన్ని ప్రస్తావించిన సిద్ధరామయ్య.. ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం సాధించినప్పుడే నిజమైన రాజకీయ స్వాతంత్య్రం అర్థవంతంగా ఉంటుందన్నారు. దేశంలో అసమానతలు ఉన్నంత కాలం రాజకీయ స్వేచ్ఛకు నిజమైన ప్రాముఖ్యత ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విలువల ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ఆయన.. కర్ణాటక వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఈ విలువలను బోధించేందుకు, పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను అమలు చేస్తూ సమానత్వం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు.

Advertisement

Next Story

Most Viewed