- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వక్ఫ్ సవరణ బిల్లుపై దద్దరిల్లిన ఉభయ సభలు

- ప్రతిపక్షాల ఆందోళన మధ్యే రాజ్యసభ ఆమోదం
- ఇది నకిలీ రిపోర్ట్ అంటూ ఖర్గే వ్యాఖ్యలు
- సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కిరణ్ రిజిజు
- లోక్‌సభలో ప్రవేశపెట్టిన జగదాంబికా పాల్
- ప్రతిపక్షాల అభ్యంతరాలను చేరుస్తామన్న అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు - 2024పై అధ్యయనం చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లోనూ జేపీసీ నివేదిక ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్షాలు చెప్పిన అసమ్మతి నోట్‌ను తుది నివేదికలో నుంచి తొలగించారని పలువురు ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభలో జేపీసీ చైర్‌పర్సన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ప్రతిపక్షాల నిరసనల నడుమే నివేదికను ప్రవేశపెట్టారు. ఆమె నివేదికను ప్రవేశపెడుతుండగా ఎన్డీయే సభ్యులు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. కాగా, అదే సమయంలో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాల ఎంపీల నినాదాలతో సభ నిర్వహంచడం అడ్డంకిగా మారడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. 'తాము లేవనెత్తిన అంశాలను పూర్తిగా చేర్చలేదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏమి కోరినా చేర్చేందుకు మా పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు' అని అమిత్ షా ప్రకటించారు. వక్ఫ్ బిల్లులో విపక్షాలు సూచించిన వివాదాలను పార్లమెంటరీ ప్రొసీజర్‌లో చేర్చాలని అమిత్ షా కోరారు. ఇందుకు తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు.
అయితే జగదాంబికా పాల్ నివేదికను చదువుతున్నంత సేపు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వెల్‌లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బారాముల్లా నుంచి గెలిచిన స్వతంత్ర ఎంపీ అబ్దుల్ రషీద్ షేక్ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. అయితే జగదాంబికా పాల్ తన నివేదికను చదువుతుండగానే ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసి, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చాయి.
మేం నకిలీ బిల్లును అంగీకరించము
వక్ఫ సవరణ బిల్లుపై జేపీసీ నివేదికను ఎంపీ మేధా కులకర్ణ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీన్ని రాజ్యసభ ఆమోదించింది. అయితే ఈ రిపోర్టుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే దీన్ని నకిలీ నివేదికగా అభివర్ణించారు. ఈ నివేదిక మా అభిప్రాయాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఈ నివేదికను తిరిగి జేపీసీకి పంపించి మళ్లీ సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. జేపీసీలో చాలా మంది సభ్యులు తమ అసమ్మతి నోట్‌ను వెల్లడించారు. కానీ ఈ నివేదిక నుంచి దాన్ని తొలగించారని ఖర్గే ఆరోపించారు. ఇది సరైన చర్య కాదు. మా అభిప్రాయాలను తుంగలో తొక్కడం అంటే అప్రజాస్వామికంగా వ్యవహరించడమే. ఇలాంటి నకిలీ రిపోర్టులను మేము అంగీకరించమని ఖర్గే స్పష్టం చేశారు. ఈ రిపోర్టును వెనక్కు పంపి.. మళ్లీ సభలో ప్రవేశపెట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాగా, ఖర్గే డిమాండ్‌కు శివసేన(యూబీటీ) ఎంపీ అర్వింద్ సావంత్ మద్దతు పలికారు. జేపీసీలో అసలు క్లాజ్ బై క్లాజ్ చర్చ అసలు జరగలేదని ఆరోపించారు. మేం జేపీసీలో అసమ్మతి నోట్ ఇచ్చాం. కానీ దాన్ని నివేదిక నుంచి తొలగించారని చెప్పారు.
కొంత మంది మన దేశంపై పోరాడుతున్నారు
ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభ్యులు ఇచ్చిన అసమ్మతి నోట్‌ను రిపోర్టులో అనుబంధ పేజీల్లో యాడ్ చేసినట్లు చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఈ విషయంలో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రిజిజు ఆరోపించారు. రిపోర్టు నుంచి ఏ భాగాన్ని కూడా తొలగించలేదని.. ప్రతిపక్ష సభ్యులు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని రిజిజు చెప్పారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కొంత మంది మన దేశం పైనే పోరాడుతున్నారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉటంకించారు. కొన్నాళ్ల క్రితం రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోనే కాకుండా దేశంతో కూడా పోరాడుతుందన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. జేపీ నడ్డా సభలో అలా వ్యాఖ్యానించారు.
ముస్లిం సమాజం మతపరమైన, ధార్మిక కార్యక్రమాల కోసం ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల పాలనను సమూలంగా మార్చేందుకు ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం ఇద్దరు ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం, ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందుతుందా లేదా అని నిర్ణయించడానికి ప్రభుత్వ అధికారి మధ్యవర్తిగా ఉండటం వంటి కీలక నిబంధనలు ఈ చట్టంలో చేర్చాడు. నెలల తరబడిర సంప్రదింపుల అనంతరం సవరించిన బిల్లును జేపీసీ జనవరి 29న ఆమోదించింది. జనవరి 30న జేపీసీ తుది నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. అయితే ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలు ఆమోదించగా, ప్రతిపక్ష ఎంపీలు సూచించిన మార్పులు తిరస్కరించబడ్డాయి.