అమెజాన్‌లో కోటికి పైగా షేర్లను విక్రయించిన బెజోస్

by S Gopi |
అమెజాన్‌లో కోటికి పైగా షేర్లను విక్రయించిన బెజోస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ భారీ సంఖ్యలో కంపెనీ షేర్లను విక్రయించారు. దాదాపు 2 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 16 వేల కోట్లకు పైనే) విలువైన 1.2 కోట్ల షేర్లను విక్రయించినట్టు బెజోస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. 2021లో కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత జెఫ్ బెజోస్ షేర్ల విక్రయించడం ఇదే మొదటిసారి. గతేడాది నవంబర్‌లోనే 2025 నాటికి 5 కోట్ల షేర్లను అమ్మాలని భావిస్తున్నట్టు బెజోస్ స్పష్టం చేశారు. గతవారంలోనే ఈ షేర్ల విక్రయం జరిగిందని, ఒక్కో షేర్‌ను 169.71 నుంచి 171.02 డాలర్ల మధ్య వాటిని అమ్మేసినట్టు బెజోస్ స్పష్టం చేశారు. శుక్రవారానికి అమెజాన్ షేర్ ధర 175.45 వద్ద ఉంది. గడించిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ ధర సుమారు 80 శాతం పెరిగింది. గతేడాది ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు అమెజాన్‌లో 12.3 శాతం వాటా ఉంది. ఇదివరకు వెల్లడించిన దాని ప్రకారం 5 కోట్ల షేర్లను విక్రయించినప్పటికీ బెజోస్‌కు 11.8 శాతం వాటా ఉండొచ్చని అంచనా. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో జెఫ్ బెజోస్ ప్రస్తుతం 195.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story